పవన్ పోటీ చేస్తారన్నా కనిపించని ఉత్సాహం అందుబాటులో ఉండని ఇన్ చార్జ్ ఉదయ్ నడిపించే నాధుడు లేక జన సైనికుల డీలా
మొగలి శివ ప్రసాద్
ప్రజాభూమి, గొల్లప్రోలు
జనసేనకు రాష్ట్రంలోనే అత్యంత అనుకూలమైన నియోజకవర్గాలలో ఒకటిగా భావించే పిఠాపురంలోని పార్టీ కేడర్ లో ప్రస్తుతం నిస్తేజం నెలకొంది. సాక్షాత్తు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుండే అసెంబ్లీకి పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా పార్టీలో ఎక్కడా ఆ ఉత్సాహం కనిపించడం లేదు. పార్టీ నాయకులను,కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేయవలసిన పార్టీ ఇన్ చార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అందుబాటులో ఉండకుండా అప్పుడప్పుడు చుట్టూ చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళుతుండడంతో పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రం గానే జరుగుతున్నాయన్న అసంతృప్తి కార్యకర్తలలో నెలకొంది. ఒకవైపు పవన్ పోటీ చేస్తే ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై వైసీపీ మల్లగుల్లాలు పడుతుండగా మరోవైపు టిడిపి తరపున సీటు దక్కకపోతే ఇండిపెండెంట్ గానైనా బరిలోకి దిగేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ జనసేన మాత్రం ఎన్నికలకు సన్నద్దమయ్యే విధంగా ఎటువంటి సమావేశాలు నిర్వహించకపోవడం, పార్టీ ఇన్ చార్జ్ ఉదయ్ శ్రీనివాస్ అందుబాటులో ఉండకపోవడంతో కేడర్ లో నిస్తేజం నెలకొంది.
పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీకి సానుకూలంగా ఉన్నప్పటికీ పరిస్థితులను పార్టీకి అనుకూలంగా మలుచుకునే విధంగా తగిన ప్రయత్నాలు జరగడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది పవన్ పిఠాపురంలో నిర్వహించిన వారాహి యాత్రకు అనూహ్య రీతిలో ప్రజల నుండి స్పందన రావడంతో వచ్చిన మైలేజ్ ను కొనసాగించడంలో పార్టీ విపల మైందన్న విమర్శలు వస్తున్నాయి. నాయకులను సమన్వయపరచి పార్టీని నడిపిస్తారన్న ఉద్దేశంతో మాకినీడి శేషు కుమారి స్థానంలో టీ టైమ్ అధినేత తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు అధినేత బాధ్యతలు అప్పగించినా నాయకులను కలుపుకు వెళ్లడంలోనూ, కార్యకర్తలను ఉత్సాహపరచడంలోనూ విప్లమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు రోజులు దగ్గర పడుతుండడంతో పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆయనకు దీటుగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కుమారుడిని బరిలోకి దించాలా, ప్రస్తుత ఇన్ చార్జ్, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాద్ ను కొనసాగించాలా అన్న అంశంపై వైసిపి తీవ్రస్థాయిలో తర్జనభర్జనలు పడుతోంది. అంతేకాకుండా ఇప్పటికే బూత్ కన్వీనర్ల సమావేశం, ముఖ్య నాయకులతో ఆంతరంగి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళుతోంది. అలాగే టిడిపి నాయకుడు వర్మ కూడా టిక్కెట్ రాకపోయినా పోటీలో ఉండేందుకు గ్రామాల వారీగా పర్యటిస్తూ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.
ఎన్నికలకు సమాయత్తం చేయని ఇన్ ఛార్జ్
వైసీపీ,టిడిపి నాయకుడు వర్మ నియోజకవర్గంలో ఎన్నికలకు సమాయత్తమవుతుండగా జనసేన పార్టీలో మాత్రం ఎటువంటి సందడి కనిపించడం లేదు. పార్టీ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఉదయ్ శ్రీనివాస్ గత కొద్ది రోజులుగా అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలు, నాయకులు అయోమయానికి గురవుతున్నారు. సాక్షాత్తు జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నా ఇందుకు సంబంధించి ఉదయ్ నాయకులు కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్త పరిచే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం ఫై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ పోటీ చేసినా లేక మరొకరు పోటీ చేసినా గ్రామాలు, మండలాల వారీ గా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ విజయం కోసం తగు ప్రణాళిక రూపొందించవలసిన బాధ్యత ఇన్ ఛార్జ్ గా ఉదయ్ శ్రీనివాస్ పై ఉందని పలువురు పేర్కొంటున్నారు. పోలింగ్ బూత్ ల వారీగా కమిటీలను నియమించాలని గతంలోనే పవన్ సూచించినా ఇంతవరకూ కమిటీలను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. పవన్ పోటీ చేస్తే అందుకు తగ్గట్టుగా క్యాడర్ ను సిద్ధం చేయవలసిన ఉదయ్ నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం ఫై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండే ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం మినహా పార్టీ కేడర్లో ఉత్సాహం నింపడంలో ఇన్ చార్జ్ విఫలమయ్యారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇప్పటి నుండైనా పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసే విధంగా చర్యలు చేపడితే పవన్ పోటీ చేసినా మరొకరు పోటీ చేసినా ఘన విజయం సాధించే అవకాశాలు ఉంటాయని ఉదాసీనంగా వ్యవహరిస్తూ సరైన పోల్ మేనేజ్ మెంట్ చేయకపోతే ప్రతికూల ఫలితాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.