- ఈనెల 19 నుండి నృసింహుని బ్రహ్మోత్సవాలు
కదిరి :ప్రహ్లాద సమేత ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 19న “అంకురార్పణ” తో ప్రారంభం కానున్నాయి. లక్షీనరసింహాస్వామి దేవాలయం నవ నారసింహ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ స్వామి, ప్రహ్లాదుని సమేతంగా దర్శనం ఇస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. దేవస్థానానికి సంబంధించిన తీర్థాలు కదిరికి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అవి భృగు తీర్థం (కోనేరు), ద్రౌపది తీర్థం, కుంతి తీర్ఠం, పాండవ తీర్థం, వ్యాస తీర్థం మొదలగునవి ఉన్నాయి. ‘ఖ’ అంటే విష్ణు పాదము ‘ఆద్రి’ కొండ అందుకే ఈ పట్టణానికి కద్రి అనే పేరు. కాలక్రమేనా కదిరిగా మారిందని చెబుతారు. కదిరిలోని నరసింహ భగవానుడు ఖద్రీ వృక్షం యొక్క మూలాల నుండి ఉద్భవిస్తున్నాడు. హిరణ్యకశిపుని చీల్చే అష్టబాహు నరసింహ (ఎనిమిది చేతులు)గా ఇక్కడ కనిపిస్తాడు. ప్రహ్లాదుడు ముకుళిత హస్తాలతో అతని ప్రక్కన నిలబడి ఉండటం మనం చూడవచ్చు. ఆశ్చర్యమేమిటంటే ప్రతిరోజూ అభిషేకం చేసిన తర్వాత, భగవంతుని మూర్తి ఇక్కడ అర్చకులచే పదేపదే తుడిచిపెట్టిన కూడా చెమట స్రవిస్తుందని అర్చకులు చెబుతున్నారు. కదిరిలోని నరసింహ భగవానుడు “ఖాద్రీ” చెట్టు యొక్క మూలాల నుండి స్వయంభువుగా ఉద్భవిస్తున్నాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ దేవాలయం ఎత్తైన ప్రహారీతో, విశాలమైన ఆవరణలో విలసిల్లుతున్నది. ఇది 13వ శతాబ్దంలో దశలవారీగా అభివృద్ధి చెందిందని శాసనాల వలన తెలుస్తున్నది. ఆలయానికి నాలుగు వైపుల గోపురాలు కలిగి ఉంది. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణా పథం, ముఖ మంటపం, అర్థ మంటపం, రంగమంటపం ఉన్నాయి. రంగ మండపంలో ఉన్న నాలుగు స్తంభాలపై ఉన్న శిల్ప కళా రీతులు అత్యంత సుందరంగా ఉంటాయి.
ఇక్కడున్న కోనేరును భృగుతీర్థం అంటారు. ఇక్కడి స్వామివారు అమ్మతల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు. ఈ అలయంలో రంగ మండపం పై వేసిన రంగుల బొమ్మలు శతాబ్దాల నాటివి. అందుచేత కొంత వెలిసినట్లున్నా, ఇప్పటికీ బాగున్నాయి. ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్తంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ధ్వజ స్తంభం పునాదిలో నుండి కాకుండా ఒక బండ పైనే అలా నిలబెట్టి ఉంది. ప్రతి ఏడు సంక్రాంతి సమయాన స్వామి వారి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి, భూదేవిలతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండకు పారువేటకు వస్తాడని భక్తుల విశ్వాసం. పారువేట అనంతరం స్వామి వారిని ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకొస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాల ప్రాముఖ్యత ఉంది. ఈ రథం 120 టన్నుల బరువుండి ఆరు చక్రాలతో సుమారు నలబై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రథోత్సవం సమయంలో భక్తులు రథంపై దవణం., పండ్లు, ముఖ్యంగా మిరియాలు చల్లుతారు. క్రింద పడిన వీటిని ప్రసాదంగా భావించి ఏరుకొని తింటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు పాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఈ రోజు భక్తులు ఉపవాస ముంటారు. ఏటా ఈ ఆలయంలో నృసింహ జయంతిని, వైశాఖ శుద్ధ చతుర్దశి, మల్లెపూల తిరుణాళ్లను వైశాఖ శుద్ధ పౌర్ణమి, చింతపూల తిరుణాళ్లను, అషాడపౌర్ణమి, ఉట్ల తిరుణాళ్లను, శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకల్ని, వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి తరువాత అంత ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో కొలువు దీరిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు “అంకురార్పణ” తో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలతో కదిరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడనుంది. జై నారసింహ ధ్వానాలతో మార్మోగనుంది. ప్రధాన ఘట్టం స్వామివారి “కల్యాణోత్సవం” వేడుక 20న నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణాన్ని కన్నులారా వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు. ఈనెల 30న స్వామివారి బ్రహ్మరథోత్సవం (తేరు) వేడుకను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2న “పుష్పయాగోత్సవం” వేడుకతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. దేశంలో ఎన్నో నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి. కానీ వాటిలో కేవలం నవ నరసింహాలయం ఎంతో ప్రత్యేకత. ఆ నవ నరసింహాలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం. ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఎంతో మహిమ, విశిష్టత కల్గిన ఈ ఆలయంలో స్వామి వారు శ్రీ ఖాద్రి నరసింహునిగా పూజలందుకుంటున్నారు. కదిరిలో కొలువైన లక్ష్మీనరసింహ స్వామిని కాటమరాయుడుగా, కదిరి నరసింహుడుగా పిలవబడుతున్నాడు. భక్తుల చేత వసంత వల్లభుడిగా, ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఆ మహిమాన్విత క్షేత్రం చూడాలంటే శ్రీసత్యసాయి జిల్లా కదిరికి రావాల్సిందే. ఈ ప్రాంతం పాకాల—తిరుపతి రైల్వే మార్గంలో ఉంది. కదిరిలో రైల్వే స్టేషను కూడా ఉంది. అదే విధంగా బస్సు సౌకర్యం కూడ బాగా ఉంది.