డాక్టర్ సురేంద్ర బాబు ఆధ్వర్యంలో విజయవంతంగా ఆపరేషన్
మరొక చిన్నారి కి ఒక చెవికి సర్జరీ
తిరుమల హాస్పిటల్స్ ఛైర్మన్ డా.పి.సురేంద్ర బాబు వెల్లడి కృతజ్ఞతలు తెలిపిన చిన్నారుల తల్లిదండ్రులు
కడప సిటీ :రాష్ట్రం లోనే మొట్టమొదటి
సారిగా కడప నగరంలోని తిరుమల హాస్పిటల్ లో ఒకేరోజు ఒకేసారి ఎస్.అబ్దుల్ హబీబ్ (3) అనే చిన్నారి కి 2 చెవులకు ఒకేసారి బైనారల్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ విజయవంతంగానిర్వహించారు.ఇలా చేయడం రాష్ట్రంలోనే మొట్టమొదటి సారి అని చెప్పవచ్చు. సోమవారం నగరంలోని తిరుమల హాస్పిటల్స్ లో డాక్టర్ సురేంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టుకతోనే చెవిటి,మూగ చిన్నారికి తిరుమల హాస్పిటల్స్ లో ఒకేసారి రెండు చెవులకు నిర్వహించిన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. సాధారణంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ పిల్లలకు 3 సంవత్సరాల లోపు వయసు ఉంటే ముందుగా ఒక చెవికి చేయడం జరుగుతుందన్నారు. తదుపరి కొంతకాలం వ్యవధి తీసుకొని రెండవ చెవికి సర్జరీ చేయడం జరుగుతుందన్నారు. ఇలా చేయడాన్ని సీక్వెన్షియల్ బైనారల్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అంటారని తెలిపారు. రాష్ట్రంలోనే ఇలా చేయడం తొలిసారి అని చెప్పారు. ఇలా చేయడం వల్ల అనేక వ్యయ ప్రయాసలు తగ్గడంతో పాటు సమయం కలిసి వస్తుందని అన్నారు. పుల్లంపేట కు చెందిన ఎస్. అబ్దుల్ వహాబ్ , రేష్మా ల కుమారుడైన అబ్దుల్ హబీబ్ కు 5 గంటలపాటు శ్రమించి అనస్థీషియాలో ఉంచి విజయవంతంగా సర్జరీ చేశామన్నారు. మత్తు ఇవ్వడంలో అనస్థీషియా స్పెషలిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర సహకరించారని తెలిపారు. అలాగే రామాపురం మండలం సరస్వతి పేట హరిజనవాడకు చెందిన రెడ్డయ్య,నిర్మల కుమార్తె ప్రవల్లిక ( 4) కు ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని జయప్రదంగా చేసినట్లు చెప్పారు. డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇరువురి చిన్నారులకు ఉచితంగా ఈ సర్జరీలను నిర్వహించమన్నారు. రాయలసీమలోనే కడప తిరుమల హాస్పిటల్ లో ఈ సర్జరీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం వారిద్దరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే ఇతర పిల్లల మాదిరి మాట్లాడడం, వినడం చేస్తారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలు సంవత్సరం దాటాక మాట్లాడకపోవడం, మనం మాట్లాడితే వినపడకుండా ఉన్నట్లయితే వెంటనే ఈ.ఎన్.టి వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. తిరుమల హాస్పిటల్స్ లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి అవసరమైన అన్ని వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సదవకాశాన్ని రాయలసీమ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ప్రవల్లిక, అబ్దుల్ హబీబ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తాము ఎన్నో చోట్ల తిరిగినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని తెలిపారు. డాక్టర్ సురేంద్రబాబు ఎంతో ఓపికగా తమ పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని ఉచితంగా నిర్వహించారని అందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.