చట్టబద్ధతతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి
మోడల్ కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
జాయింట్ కలెక్టర్, ఎన్నికల అధికారి అభిషేక్ కుమార్
హిందూపురం టౌన్ :ఎన్నికల్లో అధికారులు వారికి కేటాయించిన విధులను చట్టబద్ధతతో నిర్వహించాలని జాయింట్ కలెక్టర్, నియోజక వర్గ ఎన్నికల అధికారి అభిషేక్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. దీంతో పాటు సార్వత్రిక ఎన్నికల కోసం నియమించబడిన వ్యయ మానిటరింగ్ మెషినరీ, న్యాయ పరిశీలకులు, అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు, వీడియో నిఘా బృందాలు, ఇతర అధికారులతో ఎన్నికల నిర్వహణ, ఖర్చులు వివిధ పార్టీల అభ్యర్థులు సమావేశాలు, ర్యాలీలు, వారు వినియోగించే వాహనాలపై చేపట్టాల్సిన పరిశీలనపై సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, నియోజక వర్గ ఎన్నికల అధికారి అభిషేక్ కుమార్ మాట్లాడుతూ ,ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ అమలు చేయడం జరిగిందన్నారు. దీంతో పాటు సార్వత్రిక ఎన్నికల నామినేషన్, పరిశీలన, ఉపసంహరణ, ఎన్నిక తేదీ తో పాటు కౌంటింగ్ ఎప్పుడు అనే విషయాలను ప్రకటించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన అధికారులు అందరూ వారికి కేటాయించిన విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, ఉత్తర్యుల మేరకు చేపడుతున్న కార్యకలాపాలు సమర్ధవంతంగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ సెల్ సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు. ఇప్పుటికే అధికారులకు కేటాయించిన విధుల మేరకు అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేయాలన్నారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీ లు ఒక్కటే అని, అన్ని పార్టీలను ఒకేలా చూడాలన్నారు. ఎన్నికల్లో నామినేషన్ వేసినప్పటి నుంచి ఆ అభ్యర్ధి ఖర్చు చేసే ప్రతి పైసాను లెక్కించాలన్నారు. అభ్యర్థి ఎన్ని వాహనాలు వాడుతున్నారు, ఎంత మంది వెంట ఉన్నారు, బహిరంగ సభలు, ర్యాలీలు ఇలా ప్రతి కార్యక్రమం పై వీడియోలు, ఫోటోలు తీయించాలన్నారు. నియోజక వర్గ వ్యాప్తంగా మోడల్ కోడ్ ను కఠినంగా అమలు చేయాలన్నారు. ఎవరు కోడ్ ను ఉల్లంఘించినా వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క అధికారి పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ కాంత్ రెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్ రెడ్డి, ఎంపిడిఓలు, నియోజక వర్గ వ్యాప్తంగా ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.