విజయవాడప్రధాన ప్రతినిధి :అందరూ శాఖాహారులే…అయితే ఆకుండలోని చేపలు ఏమైనట్లు అన్న చందంగా అక్రమార్కులకు కొమ్ము కాస్తూ ఆయా ప్రాంతాల్లో అగ్రనాయకులుగా చెలామణి అవుతున్న నేటి రాజకీయ నేతల తీరు ఉండటం ప్రజలు చేసుకున్న ఖర్మ అని చెప్పాలా …లేక పాలకుల నిర్లక్ష్య వైఖరా అన్నది అర్థం కావడం లేదు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా ఎన్ని అక్రమ కేసులు,అవినీతి ఆరోపణలు చేసిన మొక్కవోని దీక్షతో అలుపెరుగని పోరాటంతో అవిశ్రాంతంగా పోరాడి అధికారంలోకి రావడంతో పాటు అట్టడుగున ఉన్న ఎంతో మంది సామాన్య కార్యకార్తలను కూడా కార్పొరేటర్, ఆపై స్థాయి నాయకులు గా గుర్తింపు తెచ్చిపెట్టేలా అనువైన రాజకీయ వాతావరణం తెచ్చిపెట్టారు.
అయితే ఆనాటి నుండి నేటి వరకు ఎన్నో ఆరోపణలు వస్తున్న అవినీతి రహిత పాలన అందించాలి అందుకు అందరూ కూడా తనతో నడవండని పిలిపునిస్తున్నా ఆ పిలుపు ఆవినీతి, అక్రమ సంపాదన కోసం అర్రులు చాచిఉన్న కొంతమంది నేతలు కాసుల కోసం కక్కుర్తి పడుతూ అవినీతి లో కూడా బంధాలు, బంధుత్వాలు పేరు చెబుతూ అవినీతికి అలవాటుపడిన కొంతమంది అధికారులతో అక్రమాలకు పాల్పడడమే కాకుండా మీకు మేమున్నాం మాతో పెట్టుకుంటే ఇక అంతే అన్నట్లు బలాదూర్ మాటలు మాట్లాడుతూ సిగ్గు ఎగ్గు అంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.
పిల్లి కళ్ళుమూసుకుని పాలు త్రాగి ఎవ్వరూ చూడలేదన్న చందంగా పాపం కొంతమంది అవినీతి నేతలు కలల్లో ఉంటే…కార్పొరేటర్ నుంచి మంత్రి స్థాయి నేతల తీరుపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికలు తెప్పించు కుంటూ ఆయన తన నివేదికలను సిద్ధం చేసుకుంటున్నారు.దీనికి తోడు కొంతమంది కార్పొరేషన్ అధికారులు కూడా గతంలో కంటే ప్రస్తుతం తాము వద్దన్నా,తమ ప్రమేయం లేకుండానే అవినీతి బురద అంటించికొనే దుస్థితి దాపరించిందని వాపోతున్నారు..ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పటికే పతనవుతున్న విధివిధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయి ఉంటే పద్ధతులకు తిలోదకాలు ఇస్తూ పెద్ద పెద్ద బడాయిలకు పోతే నిన్న నాది,నేడు నీది ,రేపటి రోజు ఎవరిది అన్న ఆలోచన కలిగిఉంటే ఎంతో కొంత ప్రజాభిమానం కచ్చితంగా ఆ నాయకుడి వెంటే ఉండి తీరుతుంది అన్న జగన్మోహనుడి ఆలోచన సరళి ఆయన నమ్మి ఆయనతో నడవాలి కోరుకునే వారిలో అది కొరవడిందని చెప్పక తప్పడం లేదు.కేవలం ఆయన కష్టం,కృషి,ఓర్పు, నేర్పుతో వీరంతా పోటీలేకుండా,ఉన్నా ఏదో నామమాత్రంగా ఉండి ఎన్నికయ్యారన్న గతాన్ని మరిచి పోతున్నారా.. లేక మరిచి పోయారా అన్న అనుమానాలు ప్రజల్లో నుంచి వ్యక్తమవుతోంది.మరి ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతాయో మరి వారికే అర్థమవ్వాలి.