గ్యాంగ్‌స్టర్ తిల్లు తాజ్‌పురియాను కత్తితో పొడిచి చంపినప్పుడు తీహార్ జైలు గదిలో విధులు నిర్వహిస్తున్న తమిళనాడు స్పెషల్ పోలీస్ లోని ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.ఆ సమయంలో మూగ ప్రేక్షకులుగా నిలబడినందుకు వారిని తమిళనాడుకు తిరిగి పంపారు. ఈ విషయాన్ని జైలు అధికారులు ఆదివారం తెలిపారు. ఢిల్లీ జైళ్ల డైరెక్టర్ జనరల్ సంజయ్ బెనివాల్ ఆ ఏడుగురిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు పోలీసులకు లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. టీఎన్‌ఎస్‌పీ అధికారులతో కూడా తమ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని జైలు అధికారి ఒకరు తెలిపారు.“తమిళనాడు పోలీసులు ఇప్పుడు ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేసి, వారిని వెనక్కి పిలిచారు” అని జైలు అధికారి ఒకరు తెలిపారు. సంఘటన జరిగిన సెల్ నంబర్ ఎనిమిది వద్ద తమిళనాడు స్పెషల్ పోలీస్ సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. తీహార్ జైలు ఆవరణలో తమిళనాడు స్పెషల్ పోలీస్ భద్రతను కల్పిస్తుంది. తీహార్ జైలు నుండి వచ్చిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజ్‌పురియాను కత్తితో పొడిచిన తర్వాత భద్రతా సిబ్బంది అతనిని తీసుకెళ్తున్నప్పుడు వారి ముందే దాడి జరిగినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం అత్యంత భద్రతతో కూడిన జైలులో గోగి గ్యాంగ్‌లోని నలుగురు సభ్యులు తాజ్‌పురియాపై ఆయుధాలతో దాడి చేశారు. కానీ అతను ఇంకా బతికే ఉన్నాడు. జైలు భద్రతా సిబ్బంది అతనిని తీసుకువెళుతుండగా, నిందితులు అతనిపై రెండవసారి దాడి చేసినట్లు ఫుటేజీలో ఉంది. దుండగులు గ్యాంగ్‌స్టర్‌పై దాడి చేస్తూనే ఉండగా, భద్రతా సిబ్బంది మూగ ప్రేక్షకులుగా ఉన్నట్లు ఫుటేజీలో కనిపించింది.