బుట్టాయగూడెం :పశ్చిమ ఏజెన్సీలో దుర్గమ్మ తీర్థంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కనకదుర్గ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. మండలంలోని రెడ్డి గణపవరంలో ఈనెల 25వ తేదీ సోమవారం నుండి 29వ తేదీ శుక్రవారం వరకు ఈ ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల ప్రారంభ సూచికంగా సోమవారం ఉదయం నాలుగు గంటల 30 నిమిషాలకు శ్రీ విఘ్నేశ్వర పూజ, అమ్మవారికి అభిషేకము, నూతన వస్త్ర సమర్పణ, ధ్వజారోహణము, స్వామివారి అభిషేకము, అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించనున్నట్లు చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా రాత్రి 10 గంటలకు భీమవరం కళాకారులచే జానపద నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీ మంగళవారం అభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన అనంతరము అమ్మవారిని పెళ్లికూతురు, స్వామివారిని పెండ్లి కుమారుని చేయడం, రాత్రి 10 గంటలకు సినీ మ్యూజికల్ నైట్ జరుగునని తెలిపారు. ఈ నెల 27వ తేదీ బుధవారం ప్రత్యేక కార్యక్రమంగా శ్రీ అన్నపూర్ణ, శ్రీవిశ్వేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవం, రాత్రి పది గంటలకు సినీ మ్యూజికల్ నైట్, ఈనెల 28వ తేదీ గురువారం ప్రత్యేక కార్యక్రమాలుగా ఉదయం 10 గంటల నుండి చండీ హోమం, మధ్యాహ్నం రెండు గంటల నుండి గ్రామోత్సవం, రాత్రి 9 గంటలకు మ్యూజికల్ నైట్, ఈనెల 29వ తేదీ శుక్రవారం జంగారెడ్డిగూడెం బాగ్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకు విశేష పూజలు, ఉదయం 11 గంటల నుండి ఆలయ సన్నిధిలో గద్దే రామచంద్రరావు, గద్దె లక్ష్మణరావు, గద్దె తాతారావు సౌజన్యంతో అఖండ అన్న సమారాధన జరుగునట్లు చెప్పారు. రాత్రి పది గంటల నుండి అమ్మవారి లడ్డు ప్రసాదం వేలం, జబర్దస్త్ టీవీ కళాకారులచే ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాత్రి 11 గంటలకు స్వామివారి పవళింపు సేవ తో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఐదు రోజులపాటు జరిగే ఈ దుర్గమ్మ తీర్థంకు బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం మండలాల నుండి వేలాదిమంది ప్రజలు తరలివస్తారు. తీర్థ మహోత్సవాలు జరిగే మొదటి రోజు, మూడవరోజు, ఐదవ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కుబడులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఉత్సవాలు జరిగే ఐదు రోజులలో సుమారు లక్ష మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో జరిగే ఏకైక తీర్థ మహోత్సవాలు ఇవే కావడంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందోత్సహాలతో, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలలో పాల్గొంటారు. ఇతర ప్రాంతాలలో ఉన్న ఈ ప్రాంత ప్రజలు సంక్రాంతి పండుగకు వచ్చి వెళ్లిన తరువాత దుర్గమ్మ ఉత్సవాలకు తిరిగి రావడం ఆనవాయితీగా వస్తుంటుంది. ఈ ఉత్సవాలలో గృహోపకరణాలు, ఆట వస్తువులు, దుస్తులు, అలంకరణ సామాగ్రి, తినుబండారముల దుకాణాలు, జెయింట్ వీల్, కొలంబస్, ఎలక్ట్రికల్ ట్రైన్, రంగులరాట్నం, తదితర రైడర్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.