కదిరి :రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన “మేమంతా సిద్ధం” బస్సు యాత్రకు హాజరై సీఎం జగనన్న కదిరి పర్యటనను విజయవంతం చేసిన అశేష జనవాహినికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.యస్. మక్బూల్ పేర్కొన్నారు. బుధవారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. సీఎం జగనన్న పర్యటన విజయవంతం చేసిన కదిరి నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉంటానన్నారు. ఉరకలెత్తే ఉత్సాహంతో బస్సుయాత్రలో పాల్గొన్న ప్రజాభిమానం చూస్తుంటే కదిరి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమనిపిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఉత్సాహం, అభిమానం రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పులివెందుల పక్కనే ఉన్న కదిరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న తపన, ఆసక్తి సీఎం జగనన్నకు ఉందని చెప్పారు. రాష్ట్రంలో గెలిచే మొట్టమొదటి సీటు కదిరి కావాలని, ఈ సీటు సీఎం జగనన్నకు మొదటి బహుమతిగా అందించాలని ప్రజలను కోరారు.