పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సజ్జల
వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏది నిజం, ఏది అబద్ధం అనేది ప్రజలకు తెలుసని అన్నారు. సొంత స్వార్థం తప్ప చంద్రబాబు మరేమీ చూసుకోవడం లేదని… ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో కూడా ఆయనకు తెలియడం లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని గతంలో అన్నవాళ్లే… ఇప్పుడు లక్ష మంది ఉద్యోగులతో పెన్షన్లు ఇవ్వొచ్చు కదా అంటున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గతంలో ఒకటో తేదీన 80 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యేదని… కానీ ఇప్పుడు రెండో రోజుకు 60 శాతం పంపిణీ మాత్రమే పూర్తయిందని చెప్పారు. పెన్షన్లను స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి రావడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేదే ఆయన ఆలోచన అని చెప్పారు. ప్రజలకు అన్నీ తెలుసని… చంద్రబాబును ప్రజలు నమ్మరని అన్నారు.
కూటమిలో ఉన్నారు కాబట్టే… పై నుంచి ఒత్తిడి చేయించి అధికారులను బదిలీ చేయించారని సజ్జల విమర్శించారు. తాము వ్యవస్థలను మేనేజ్ చేయాలని అనుకోవడం లేదని… తాము ప్రజలనే నమ్ముకున్నామని చెప్పారు. చంద్రబాబు, పురందేశ్వరి ఫెయిల్యూర్ లీడర్స్ అని ఎద్దేవా చేశారు.