తెలంగాణ : హీరో అల్లు అర్జున్ నివాసంపై ఓయూ విద్యార్థుల దాడి ఘటనపై సినీ నిర్మాత అల్లు అరవింద్ విచారం వ్యక్తం చేశారు. అందరూ సంయమనం పాటించాలని, అదే మంచిదని వ్యాఖ్యానించారు. ”మా ఇంటి బయట జరిగిందంతా చూశారు. ప్రస్తుతం మేం సంయమనం పాటించాల్సిన సమయం. దేనికీ రియాక్ట్ కాకూడదు. పోలీసులు వచ్చి ఆందోళనకు దిగిన వారిని తీసుకెళ్లారు. కేసు పెట్టారు. ఎవరైనా గొడవ చేయడానికి వస్తే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటివి ఎవరూ ప్రోత్సహించకూడదు. మీడియా వచ్చారు కదా అని.. ఈ ఘటనపై మేం స్పందించం. సంయమనం పాటించాల్సిన సమయం.. అదే పాటిస్తున్నాం. తొందరపడి ఎలాంటి చర్యలకు దిగొద్దు” అని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థులు దాడి చేశారు. ఇంటి ఆవరణలోని పూలకుండీలను కొందరు ధ్వంసం చేశారు. బన్నీ ఇంటిపైకి టమాటాలు విసిరారు. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఓయూ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నామని చెప్పారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా కొందరు వ్యక్తులు ప్లకార్డులు పట్టుకొని బన్నీ ఇంటి వైపు వచ్చారు. లోపలికి వెళ్లేందుకు గేటు తీయాలని కోరారు. అందుకు అల్లు అర్జున్ ఇంటి సిబ్బంది నిరాకరించారు. దీంతో నినాదాలు చేస్తూ.. గోడపైకి ఎక్కారు. అక్కడి నుంచి ఇంటి ఆవరణలోకి దూకారు. పూల కుండీలను ధ్వంసం చేశారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో పిల్లలను అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ ఇంటికి తరలించారు. తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు ప్లకార్డులు పట్టుకుని అల్లు అర్జున్ ఇంటిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
iz17x4