తాడేపల్లి:
అచ్యుతాపురం సెజ్‌లో ఎసన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్ తర్వాత సహాయ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పాలన మీద ఏ మాత్రం దృష్టి లేని చంద్రబాబు ప్రభుత్వానికి రోజూ మా పార్టీని, వైయస్ జగన్‌గారిని నిందించడమే లక్ష్యంగా ఉందని, అందుకే ప్రతి ఘటననూ రాజకీయం చేసే యత్నం చేస్తోందని ఆయన ఆక్షేపించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు .
అచ్యుతాపురం సెజ్‌లో బ్లాస్ట్‌పైనా ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్న ఆయన, ఆ ప్రమాదాన్ని కూడా తమ పార్టీపై వేసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, ఆయన చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని స్పష్టం చేశారు. నిజానికి అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలుడు ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదన్న
మాజీ మంత్రి, ఇప్పటికైనా ప్రమాద కారకులపై చర్యలు తీసుకోవాలని, ఇకపై ఇలాంటి దుర్ఘటనలు జరక్కుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. గత మా ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య చోటు జరిగిన ప్రమాదాలు, మృతుల సంఖ్య గురించి మాట్లాడడం అసంబద్ధమని, అది కేవలం తమను నిందించడమే అని మాజీ మంత్రి వెల్లడించారు.
ఆ దుర్ఘటనను రాజకీయం చేయడమే చంద్రబాబు వైఖరిలా కనిపించిందని అన్నారు. నిజానికి నిన్న (బుధవారం) ఘటన జరిగిన సమయంలో సీఎం చంద్రబాబుతో పాటు, హోం మంత్రి, డీజీపీ అందరూ సచివాలయంలోనే సమావేశంలోనే ఉన్నా.. వెంటనే స్పందించలేదని ఆక్షేపించారు. ఆలస్యంగా మీడియాతో మాట్లాడిన మంత్రులు కూడా కేవలం వైయస్ జగన్‌ను దూషించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. థర్డ్ పార్టీతో ఆడిట్ చేయించి, దాన్ని అమలు చేయకపోవడం వల్లనే ఇదంతా జరిగినట్లు చూపే ప్రయత్నం చేశారని తెలిపారు. మరోవైపు సీఎం చంద్రబాబు కూడా వైయస్ జగన్‌ను నిందిస్తూ.. గత ప్రభుత్వం వ్యవస్ధలన్నింటినీ సర్వ నాశనం చేసిందని, అందువల్ల తామేమీ చేయలేకపోతున్నామని చెప్పడం విడ్డూరమన్న మాజీ మంత్రి, దానిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.