- జిల్లా ఎస్పీ కేకేఎన్. అన్బురాజన్
- నార్పల పోలీసు స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ
అనంతపురము బ్యూరో
సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా గట్టిగా పని చేయాలని, ప్రశాంతత కొనసాగాలని, అందుకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కేకేఎన్. అన్బురాజన్ ఆదేశించారు. జిల్లాలోని నార్పల పోలీసు స్టేషన్ ను శుక్రవారం జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పరిసరాలను సందర్శించి, పోలీసు స్టేషన్ తోపాటు, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. రిసెప్సన్ సెంటర్, లాకప్ గదులను పరిశీలించారు. నార్పల పోలీసు స్టేషన్ పరిధిలోని ఫ్యాక్షన్ ప్రభావిత, సమస్యాత్మక గ్రామాల్లోని తాజా పరిస్థితులపై ఎస్పీ ఆరా తీశారు. గ్రామాల్లో అశాంతి, అలజడులు, సమస్యలకు కారణమయ్యే వారిపై నిరంతర నిఘా వేయాలన్నారు. గట్టిగా పని చేయాలని సూచించారు. విధుల్లో భాగంగా పోలీసులు మెయింటైన్ చేసే ప్రతీ రికార్డును సమీక్షించారు. కేసులు త్వరితగతిన పూర్తీ చేయాలన్నారు. దొంగతనాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మట్కా, గుట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్, గంజాయి, నాటు సారా తయారీ & అమ్మకం తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పని చేయాలని స్పష్టం చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావాలని పోలీస్ అధికారులకు సూచించారు.