ఆధార్, యూనిక్ మొబైల్ నంబర్, పాన్ కార్డులతో సెకండరీ వెరిఫికేషన్
కరోనా తర్వాత డిజిటలైజేషన్ పెరగడంతో బ్యాంకు ఖాతాలు తెరిచే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే బ్యాంకులు తమ కస్టమర్లు ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడుతున్నాయి. దీనిలో భాగంగా బ్యాంకు ఖాతాలకు కేవైసీ విధాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా తాజాగా కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. అదేంటంటే… కేవైసీని మరోసారి అప్‌డేట్ చేయడం. ఈ విషయమై ఇప్పటికే భారతీయ రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వంతో బ్యాంకులు చర్చలు జరుపుతున్నాయి. దీనిలో భాగంగా బ్యాంకు ఖాతా తెరవడానికి ప్రస్తుతం ఆధార్ కార్డు, ఓటరు గర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటి ఏదో ఒక ధృవపత్రాన్ని ఉపయోగిస్తున్నాం. ఇలా వీటిని వినియోగించి బ్యాంకు ఖాతా తెరిచినవారు ఇప్పుడు మరోసారి ఆధార్, యూనిక్ మొబైల్ నంబర్, పాన్ కార్డు వంటి వాటితో సెకండరీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. తద్వారా జాయింట్ ఖాతాలను కూడా అకౌంట్ అగ్రిగేటర్ల నెట్‌వర్క్ యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఒకే ఫోన్ నంబర్‌తో వివిధ ఖాతాలు కలిగిన ఖాతాదారులు, జాయింట్ ఖాతాలు కలిగిన వారు మళ్లీ కేవైసీ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. ఇక గత నెలలో ఫైనాన్స్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్‌డీసీ) ఏకరీతి కేవైసీ నిబంధనలు, కేవైసీ రికార్డుల అంతర్ వినియోగం, కేవైసీ ప్రక్రియ సరళీకరణ, డిజిటలైజేషన్ గురించి చర్చించింది.