Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్క‌నీసం దేవుళ్ల‌నైనారాజ‌కీయాల‌కు దూరం పెట్టండి: సుప్రీంకోర్టు

క‌నీసం దేవుళ్ల‌నైనారాజ‌కీయాల‌కు దూరం పెట్టండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ:‌తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా నలుగురు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బి.ఆర్.గవాయ్, కె.వి.విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కలిపి విచారణ చేపట్టింది. తొలుత సుబ్రమణ్య స్వామి తరపున న్యాయ వాది రాజశేఖర్‌రావు వాదనలు వినిపించారు.ప్రసాదంలోని పదార్థాలు కలుషితమయ్యాయని సీఎం చేసిన ప్రకటన వివాదాస్పదమైందని అన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు. దీనిపై టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా సమాధానం ఇచ్చారు. గత 50 ఏళ్లుగా కర్నాటక ప్రభుత్వ సంస్థ నందిని నెయ్యి సరఫరా చేస్తుంటే, గత ప్రభుత్వం రాగానే దాన్ని రద్దు చేశారని లూథ్రా చెప్పారు. గతేడాది డిసెంబర్‌లో నెయ్యి కొనుగోలు కోసం టెండర్‌ ప్రక్రియ నిర్వహించారని, దాని ప్రకారమే ఈ ఏడాది జూన్‌, జులై నెలల్లో నెయ్యి సరఫరా అయిందని వివరించారు.
ఈ ఏడాది జూన్‌ మొదటి వారం నుంచి జులై 4 వరకు వచ్చిన టాంకర్లలోని నెయ్యిని వినియోగించారని, జులై 6 నుంచి వచ్చిన ట్యాంకర్లను మాత్రం తనిఖీలు జరిపి అనుమానం రావడంతో ఎన్​డీడీబీ సహకారం తీసుకున్నట్లు చెప్పారు. జులై 4కి ముందు తయారైన లడ్డూ ప్రసాదంపై భక్తుల నుంచి అనేక పిర్యాదులు రావడంతోనే తనిఖీలు చేశామన్నారు. జూన్‌ మొదటి వారం నుంచి సరఫరా చేస్తున్న గుత్తేదారే జులైలో కూడా సరఫరా చేశారని, అందువల్లే తనిఖీలు చేసి, అన్ని సంస్థలకు షోకాజ్‌ నోటీసులిచ్చినట్లు తెలిపారు.ఈ క్రమంలో లూథ్రాకు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. జులైలో నివేదిక వస్తే సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ ప్రశ్నించారు. ఆధారరహితంగా సీఎం ఎలా బహిరంగ ప్రకటన చేశారని ప్రశ్నించింది. కోట్లాది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారంపై రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారని ధర్మాసనం ఆక్షేపించింది. కల్తీ నెయ్యి వాడినట్లు చెప్తున్నారని, ఆ నెయ్యితో తయారు చేసిన లడ్డూలను కూడా ల్యాబ్‌లో పరీక్షించారా అని ప్రశ్నించింది.గుజరాత్‌లోని ఎన్​డీడీబీ తర్వాత మరేదైనా ల్యాబ్‌తో తనిఖీ చేయించారా అని జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ అడిగారు. ఒకే సంస్థ నివేదికపైనే ఎలా ఆధారపడతారని, ఇంకొన్ని ల్యాబ్‌ల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించిన లూథ్రా, ప్రస్తుతం జరుగుతున్న సిట్‌ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. టీటీడీ, ప్రభుత్వ వివరణను నమోదు చేసిన ధర్మాసనం, ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారని, ఇలాంటి కల్తీ నెయ్యిని ఎప్పుడూ ఉపయోగించలేదని టీటీడీ ఈఓ పేర్కొన్నట్లు కొన్ని పత్రికా కథనాలు కూడా చూపిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా, ఈ విషయంపై విచారణ అవసరం అని కోర్టు పేర్కొంది. దర్యాప్తు ప్రక్రియలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ప్రజల మనోభావాల్ని ప్రభావితం చేసేలా రాజ్యాంగపరమైన ఉన్నత స్థాయిలో ఉన్న వారు ప్రకటన చేయడం తగదని తాము ప్రాథమికంగా భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో అసంతృప్తి వ్యక్తం చేసింది.కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారమని, కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరం ఉంచుతారని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయడం, ఆ తర్వాత FIR నమోదవడం, సిట్‌ ఏర్పాటు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో, ప్రస్తుతం ఏర్పాటు చేసిన సిట్‌ సరిపోతుందా లేక కేంద్రం నుంచి ఎవరినైనా నియమించాలనే విషయంపై కేంద్ర సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. దీనికి సొలిసిటర్‌ జనరల్‌ కొంత సమయం కోరడంతో తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నం మూడున్నరకు వాయిదా వేసింది. ఉన్నత పదవుల్లో ఉన్నవారు కొంత సంయమనం పాటించేలా మీ క్లయింట్లకు చెప్పాలని టీటీడీతోపాటు ప్రభుత్వం న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article