నగరంలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న తరుణంలో ఎక్కడా పారిశుధ్య సమస్య తలెత్తకుండా నగరపాలక పారిశుధ్య విభాగం దృష్టి సారించాలని నగర మేయర్ మహమ్మద్ వసీం ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని 37వ డివిజన్ పరిధిలో మేయర్ పర్యటించారు. వర్షాలకు డ్రైనేజీలు పొంగి రోడ్లపై మురుగునీరు ప్రవహించి బురద పెరిగిపోయి ఉండడంతో పారిశుద్ధ్య అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై అడ్డంగా ఉన్నటువంటి బురదను తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని నగరపాలక ఆరోగ్య అధికారి గంగాధర్ రెడ్డి కి సూచించారు. వెంటనే డోజర్ ను ఏర్పాటుచేసి బురద తొలగింపు పనులను అధికారులు చేపట్టారు.
ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ వర్షాలను దృష్టిలో ఉంచుకొని వేగవంతంగా కాలువలలో పూడికతీత పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు డ్రైనేజీల్లో ఆటంకం లేకుండా ప్రవహించేలా ఎప్పటికప్పుడు పూడికతీతతో పాటు చెత్తాచెదారం తొలగించేలా నగరంలోని అన్ని సచివాలయాల శ్యానిటేషన్ సెక్రటరీ లు పర్యవేక్షణ చేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అనిల్ కుమార్ రెడ్డి, ఎంహెచ్ఓ గంగాధర్ రెడ్డి, నాయకులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.