సూర్యాస్తమయం తరువాత తినే ఆహారాల విషయంలో జాగ్రత్త పాటించాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎప్పుడు తిన్నా అనారోగ్యమే. ముఖ్యంగా సూర్యాస్తమయం అయ్యాక వాటిని పూర్తిగా తినడం మానేయాలి. బ్రెడ్ తో చేసిన వంటకాలు, చక్కెర నిండిన కూల్ డ్రింకులు, కొవ్వు నిండిన పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ వంటివి తినకపోవడం మంచిది. ఈ ఆహారాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల ఒకేసారి నీరసం వచ్చేస్తుంది. నిద్ర కూడా సరిగా పట్టదు.బిర్యానీ అయినా కూరలైనా, పచ్చళ్ళు అయినా… స్పైసీగా ఉంటేనే రుచిగా ఉన్నట్టు భావిస్తారు. ఎంతోమంది మధ్యాహ్నం భోజనంలో ఇలాంటి స్పైసీ ఫుడ్ తిన్నా పరవాలేదు. కానీ రాత్రి సమయంలో స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉండాలి. లేకుంటే జీర్ణవ్యవస్థ ఇబ్బంది పడుతుంది. యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు వస్తాయి. గుండెల్లో మంట కలుగుతుంది. నిద్ర కూడా సరిగా పట్టదు.
ఈ స్పైసి ఫుడ్స్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీనివల్ల నిద్రలేమి వంటి సమస్యల బారిన పడవచ్చు.ఎప్పుడు పడితే అప్పుడు కాఫీలు, టీలు తాగే వారి సంఖ్య తక్కువేమీ కాదు. సాయంత్రం నాలుగులోపే కాఫీ, టీ తాగేయాలి. వీటిల్లో కెఫీన్ అధికంగా ఉంటుంది. కాఫీ, టీలతో పాటు ఎనర్జీ డ్రింక్స్‌లో కూడా కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇలా కెఫీన్ అధికంగా ఉండే ఆహారాలను సూర్యాస్తమయం తర్వాత తినడం వల్ల నిద్ర సరిగా పట్టదు. అర్ధరాత్రి వరకు మేలుకొని ఉండాల్సి వస్తుంది. నిద్రా నాణ్యత కూడా తగ్గిపోతుంది.డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, క్రీములు, సాస్‌లు, వేయించిన మాంసం వంటి వాటిలో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. రాత్రి అయ్యాక భారీ భోజనాలు, కొవ్వు నిండిన ఆహారాలు తినకపోవడం మంచిది. ఇవి కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు కారణం అవుతాయి. దీర్ఘకాలంలో ఇతర సమస్యలు కూడా రావచ్చు.
రాత్రిపూట మద్యాన్ని తాగే వారి సంఖ్య తక్కువేమీ కాదు. నిజానికి ఆల్కహాల్ రాత్రి పూట తాగకూడదు. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. నిద్రా నాణ్యతను తగ్గిస్తుంది. రోజంతా అశాంతిగా అనిపించేలా చేస్తుంది.సిట్రస్ పండ్లు, టమోటోలు, వెనిగర్ వంటివి ఆమ్ల ఆహారాల జాబితాలోకి వస్తాయి. వీటిని రాత్రిపూట తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట వంటివి రావచ్చు. జీర్ణక్రియ కూడా అసౌకర్యంగా మారుతుంది. కాబట్టి వీటిని మధ్యాహ్నం పూట మాత్రమే తినండి. రాత్రిపూట ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండండి.