Sunday, January 19, 2025

Creating liberating content

సాహిత్యంనవరాత్రుల వేళ ఆయుధ పూజ ..

నవరాత్రుల వేళ ఆయుధ పూజ ..

హిందూ మత విశ్వాసాల ప్రకారం, మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అశ్విని మాసం శుక్ల పక్షంలో మహా నవమి అంటే తొమ్మిదో రోజున కచ్చితంగా ఆయుధాలను పూజిస్తారు. హిందూ మతంలో ఆయుధాల పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దసరా పండుగకు ఒకరోజు ముందు జరుపుకునే పూజలో ఆయుధాలను పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో విజయదశమి రోజున ఆయుధాల పూజ చేస్తారు. పురాణాల ప్రకారం, పాండవులు కూడా తమ విజయాన్ని కోరుతూ ఆయుధాలకు పూజ చేశారు. ఈ నేపథ్యంలోనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆయుధ పూజలు చేస్తారని పండితులు చెబుతారు.సప్తమి, దుర్గాష్టమి, మహర్నవమి రోజులు త్రిమూర్త్యాత్మక దేవీ స్వరూపానికి నిదర్శనాలు. మహిషాసుర మర్దినిగా రాక్షసుడిని వధించి, విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకునే వారని పురాణాల్లో పేర్కొనబడింది. తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని మహానవమి అని పిలుస్తారు. దుర్గాష్టమి, విజయదశమిలాగే ‘మహర్నవమి’ కూడా దుర్గా మాతకు విశేషమైన రోజు.నవరాత్రుల చివరి రోజున తొమ్మిది మంది కన్యా రూపాలు సంకేత పూర్వకంగా ప్రాతినిధ్యం వహించే శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మహా నవమి రోజున బతుకమ్మ పూజ చేసి సరస్వతీ పూజ చేస్తారు. అనంతరం బతుకమ్మ నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

దక్షిణ భారతంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, కర్నాటక, తమిళనాడులో ఆయుధ పూజను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తమ ఇంట్లో, దుకాణాల్లో, కార్యాలయాల్లో ఉండే పనిముట్లన్నింటికీ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీన శుక్రవారం నాడు ఆయుధ పూజ జరుపుకోనున్నారు. మరోవైపు తమ పూర్వీకులను పునీతులను చేయడానికి భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగమ్మ తల్లిని నింగి నుంచి నేలకు రప్పించింది కూడా ఈరోజే. అందుకే నవరాత్రుల్లో మహానవమి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఆయుధ పూజ రోజున కార్మికులు, వాహనదారులు, కులవృత్తులవారు ఇతర రంగాల్లో పనిచేసే వారంతా తమ ఆయుధాలకు కచ్చితంగా పూజలు చేస్తారు. ఇలా పూజ చేయడం వల్ల తాము ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఉంటామని, తాము చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తామని చాలా మంది నమ్ముతారు.
నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన ఈ మహర్నవమి నాడు కొంతమంది ముక్తేశ్వరీ దేవిని పూజిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు. ఈ పండుగ పర్వదినాన పిండి వంటలతో ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఉత్తర భారతంలో మహా నవమి రోజున కన్య పూజలు నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article