స్వాతంత్రోద్యమానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఊపిరూదారని, అలాంటి మహోన్నత వ్యక్తిని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. 127వ అల్లూరి జయంతిని నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కులో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ… బ్రిటీష్ పాలకులు దేశాన్ని దోపిడీకి గురిచేస్తున్న సమయంలో మన్యం ప్రజలతో కలసి పోరాటం చేశారన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి ఒక మహోజ్వల శక్తి అని చెప్పారు. అందరినీ ఏకతాటిపైకి తెచ్చి బ్రిటీష్ పాలకులను గడగడలాడించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి, తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి వై.శ్రీనివాసరావు, స్పెషల్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.వి.ఎస్ సుబ్బలక్ష్మి, పరిపాలన అధికారి బి.రాజేశ్వరరావు, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీరామ్మూర్తిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.