Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్ఏపీలో బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై మంత్రుల కీలక భేటీ

ఏపీలో బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై మంత్రుల కీలక భేటీ

సమావేశంలో పాల్గొన్న 8 మంది బీసీ మంత్రులు, హోం మంత్రి వంగలపూడి అనిత
బీసీల గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం

ఆంధ్ర ప్రదేశ్ లో వెనుకబడిన తరగతులు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నట్లు ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు స్పష్టం చేశారు. ఈ చట్టం రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రక్షణ కవచంలాంటిదని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ, బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్న అన్ని అంశాలనూ సీఎం చంద్రబాబు అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారని వారు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మూడో బ్లాక్‌లో నిర్వహించిన బీసీ రక్షణ చట్టం విధివిధానాల రూపకల్పనపై నిర్వహించిన తొలి సమావేశంలో బీసీ సామాజికవర్గానికి చెందిన 8 మంది మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎస్.సవిత, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ సహా హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. తొలుత బీసీ రక్షణ చట్టం ఆవశ్యకతను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వివరించారు. జగన్ హయాంలో రాష్ట్రంలో బీసీల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కరవైందని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు బలైపోతున్న బీసీల దుస్థితిని మీ కోసం బస్సు యాత్రలో సీఎం చంద్రబాబునాయుడు, యువ గళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ స్వయంగా పరిశీలించారన్నారు. బీసీలను ఆదుకోవాలని నిర్ణయించి.. బీసీ డిక్లరేషన్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రకటించారన్నారు. ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ, సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారన్నారు. ఇటీవలే చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్‌లో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేశారన్నారు. ఆదరణ వంటి పథకాల అమలుకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి సవిత తెలిపారు. ఇదే సమయంలో బీసీ రక్షణ చట్టం విధివిధానాల రూపకల్పనకు చర్యలు చేపట్టారన్నారు. కులపరంగా, వ్యక్తిగతంగా దూషించినప్పుడు చర్యలు తీసుకునేలా చట్టం రూపొందిస్తున్నామన్నారు. ఏపీలో అమలు చేయబోయే బీసీ రక్షణ చట్టం దేశంలోనే తొలిసారని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, బీసీ చట్టం రూప కల్పనలో న్యాయ నిపుణులు, రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ, చట్టాన్ని పకడ్బందీగా రూపొందించాలన్నారు. ఇందుకోసం ఇతర చట్టాలను అధ్యయనం చేయాలన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జగన్ హయాంలో బీసీలపై జరిగిన దాడులను చూసి వెనుకబడిన తరగతుల రక్షణకు ప్రత్యేక చట్టం రూపొందించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నిర్ణయం తీసుకున్నారన్నారు. చట్టం రూపకల్పనలో సెక్షన్లు, ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి రూపొందించాలన్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో బీసీల రక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, చట్టం రూపకల్పనలో వినియోగించాలన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ చట్టం బీసీలకు రక్షణ కవచంలా ఉండాలన్నారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ బీసీ రక్షణ చట్టం రూపకల్పనలో మరిన్ని పర్యాయాలు సమావేశాలు నిర్వహించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article