హిందూపురం టౌన్
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నుండి ప్రజా పోరు యాత్ర నిర్వహించడం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైందని. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 222 మంది అభ్యర్థులు బయోడేటాలు పార్టీకి ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అలాగే హిందూపురం అసెంబ్లీ స్థానానికి సంబంధించి 11 మంది ఆశావహులు వారి బయోడేటాను రాష్ట్ర పార్టీకి అందచేయడం జరిగిందన్నారు. ఈ నెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ప్రజా పోరు యాత్ర జరుగుతుందన్నారు. ఈ ప్రజా పోరు కార్యక్రమంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు ,ప్రజలకు వస్తున్న సంక్షేమ పథకాలు అలాగే పంచాయతీలకు సంబంధించి కేంద్రం నేరుగా ఇస్తున్న నిధుల వివరాలు ప్రజలకు తెలియజేస్తూ యాత్ర సాగుతుందని తెలియజేశారు. ప్రతి పంచాయతీకి జనాభా ప్రాతపదికన కేంద్రం నుండి ప్రతి సంవత్సరం కోట్లలో నిధులు వస్తున్న ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళిస్తున్న విషయాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ , గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, వంటి ఎన్నో పథకాలు దేశవ్యాప్తంగా కేంద్రం అమలు పరుస్తున్న మన రాష్ట్రంలో మాత్రం ప్రజలకు అందకపోవడం శోచనీయం అన్నారు. అలాగే హిందూపురం మున్సిపాలిటీకి కేంద్రం నుండి అమృత్ పథకం ద్వారా, స్వచ్ఛభారత్ పథకం ద్వారా, 14 ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను దారి మళ్ళించి మున్సిపాలిటీ అభివృద్ధికి కుంటుపడుతున్న విషయాన్ని ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలను ఓడించి భారతీయ జనతా పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రజా పోరు యాత్ర సాగుతుందని అన్నారు ఈ సమావేశంలో హిందూపురం అసెంబ్లీ కన్వీనర్ ఆదర్శ కుమార్, జిల్లా ప్రజా పోరు యాత్ర కో కన్వీనర్ కె.వి చలపతి, జిల్లా ఉపాధ్యక్షులు వరప్రసాద్, ప్రజా పోరు యాత్ర అసెంబ్లీ కోకన్వీనర్లు తిరుమలేష్ ,టీ కే బాబు , పట్టణ మాజీ అధ్యక్షులు శంకర్, నాయకులు బద్రి, చంద్ర, , కృష్ణప్ప, వెంకటరామిరెడ్డి, ఉదయ్ కుమార్, జయకృష్ణ, గోవిందు, టి.నాగరాజు, నరేష్, నాగరాజు, నాగేంద్ర, జనార్ధన, మోహన్ , శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.