పీవోకే భారత్‌లో అంతర్భాగమని తాము కూడా చెబుతున్నామని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే అంటున్నామన్నారు. కానీ బీజేపీ ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని తెరపైకి ఎందుకు తీసుకువస్తోంది? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు పీవోకే గురించి పదేపదే మాట్లాడుతున్నారని… ఈ పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు వారేం చేశారో చెప్పాలని నిలదీశారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… 400 స్ధానాలకు పైగా గెలుస్తామని ప్రారంభంలో చెప్పినట్లుగా ఇప్పుడు బీజేపీ చెప్పడం లేదన్నారు. పెట్రోల్ ధరలు రూ.100 దాటాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉన్న వారణాసిలో పేపర్ లీక్‌ల ఘటనల వంటి వాస్తవ అంశాలను బీజేపీ మరుగునపడేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.