నెల్లూరు :నెల్లూరు జిల్లాలోని పలు కోళ్ల ఫారాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకింది. వైరస్ కారణంగా జిల్లాలోని పొదలకూరు, కోవూరు, సైదాపురం ప్రాంతాల్లో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం కోళ్ల శాంపిల్స్‌ను భోపాల్ ల్యాబ్‌కు పంపించారు. కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని రిపోర్టులో తేలింది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశుసంవర్ధక శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా తక్షణమే జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.బర్డ్‌ఫ్లూ కారణంగా కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో మూడు నెలల పాటు చికెన్ షాపులు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా చికెన్, గుడ్లను తినకూడదని సూచించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మాత్రమే ఈ వ్యాధి బయటపడింది. మిగతా ఎక్కడా లేదు. కానీ అధికారులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మీ ప్రాంతంలో భారీగా కోళ్లు మృతి చెందుతున్నట్లుగా సమాచారం వస్తే.. అక్కడ చికెన్ తినడం ఆపేయాలని చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో చికెన్, గుడ్ల ధరలు భారీగా పడిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ వ్యాపారుల్లోనూ ఆందోళన నెలకొంది.