హైదరాబాద్:గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు నియామకాలు కొందరికి ఆనందం, మరికొందరికి నష్టాన్ని మిగిలిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్విటర్ వేదికగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ లేఖ రాశారు. గత ఏడాది గురుకుల బోర్డు డిగ్రీ లెక్చరర్, పీజీటీ, టీజీటీ లాంటి అనేక ఉద్యోగ నియామకాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేశారని .. దీంతో అర్హత కలిగిన వేలాది మంది నిరుద్యోగులు అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాశారని తెలిపారు. బోర్డు తెలిపిన అన్ని ఫలితాల్లో ఒకే అభ్యర్థి.. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ..ఎక్కువ ఉద్యోగాలు సాధించిన వ్యక్తి ఏదో ఒక ఉద్యోగాన్ని ఎంచుకొని మిగతా వాటిని వదిలేశారని అన్నారు. అయితే ఆ అభ్యర్థి వదిలి వెళ్లిన ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉండిపోతున్నాయని ..దీంతో తర్వాత మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు తీరని నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు తక్షణమే జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి డిసెండింగ్ ఆర్డర్ లో ఉద్యోగాలు భర్తీ చేసి, మెరిట్ ఆధారంగా రెండో జాబితా విడుదల చేసి ఖాళీలు లేకుండా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.