ఈ నెల 19 నుంచి 25 మధ్య నైరుతి రుతుపవనాలు దేశం నుంచి తిరోగమించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటిన కేరళను తాకుతాయి. జూలై 8 వరకు దేశవ్యాప్తంగా విస్తరిస్తుంటాయి. సెప్టెంబర్ నాటికి వాయువ్య భారతం నుంచి ఉప సంహరణ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 17 నుంచి తిరుగోమనం మొదలై.. అక్టోబర్ 15 నాటికి తిరుగుముఖం పడుతాయి. వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు వారం రెండోభాగంలో పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ నాలుగు నెలల రుతుపవనాల సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటి నుంచి దేశంలో 836.7 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.సాధారణం 772.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదైంది. వాయువ్య భారతంలో 4శాతం, మధ్య భారతంలో 19శాతం, దక్షిణ భారతంలో 25శాతం ఎక్కువ వర్షాపాతం రికార్డయ్యింది. రాబోయే రెండు రోజుల్లో రుతుపవనాలు బలహీనపడుతాయని వాతావరణశాఖ నిపుణులు తెలిపారు. తిరుగుముఖం పట్టిన రుతుపవనాలు గంగా మైదానం ద్వారా బంగాళాఖాతంలో ప్రవేశిస్తుంటాయి. ఈ క్రమంలో ఈశాన్యం నుంచి తిరోగమనం చెందడంతో వీటిని ఈశాన్య రుతుపవనాలుగా పేర్కొంటారు. వీటితో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.