కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజీత్ గంగోపాధ్యాయ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో విద్యా వ్యవస్థకు సంబంధించి పలు కీలక తీర్పులు ఇచ్చిన ఆయన రాజకీయాల్లో కాలుమోపేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం తాను రాజీనామా చేయనున్నానని, ఆ తర్వాత ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానని తెలిపారు. రాజకీయ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న జస్టిస్ అభిజీత్.. తన అంతరాత్మ ప్రబోధానుసారం ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ‘‘కలకత్తా హైకోర్టు జడ్జి పోస్టుకు రాజీనామా చేస్తున్నాను. అంతరాత్మ ప్రబోధానుసారమే ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ప్రజా సమూహంలోకి, విశాల ప్రపంచంలోకి వెళ్లాల్సిన అవసరముంది. జడ్జిగా నా ముందు వచ్చిన కేసులను మాత్రమే పరిష్కరించగలను. కానీ, దేశంలో, మన రాష్ట్రంలో ఎంతోమంది ప్రజాలు నిస్సహాయంగా ఉన్నారు’’ అని జస్టిస్ అభిజీత్ పేర్కొన్నారు.