Friday, November 29, 2024

Creating liberating content

టాప్ న్యూస్కొంచెం ఆలస్యం కావచ్చు - తప్పు చేసినవారు తప్పించుకోలేరు: సీఎం చంద్రబాబు

కొంచెం ఆలస్యం కావచ్చు – తప్పు చేసినవారు తప్పించుకోలేరు: సీఎం చంద్రబాబు

-దీపావళికి ఉచిత గ్యాస్ ఇస్తాం: సీఎం చంద్రబాబు
-కూటమి ప్రభుత్వం ఏర్పడి
100 రోజులు
-మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం
-సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తామని వెల్లడి
-మూడు పార్టీలు ఇదే సమన్వయంతో
ముందుకెళ్లాలని పిలుపు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ ను దీపావళికి అందిస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తామని వెల్లడించారు. ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చాలా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. వరద బాధితులందరికీ సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పులు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. తప్పిదాలకు పాల్పడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు. చట్టాన్ని పరిరక్షించడానికి వ్యవస్థలు ఉన్నాయని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని అన్నారు. కూటమి పార్టీల గురించి చెబుతూ, ప్రస్తుతం ఉన్న సమన్వయమే భవిష్యత్తులోనూ మూడు పార్టీల మధ్య ఉంటుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అభిప్రాయభేదాలు లేకుండా ముందుకు సాగాలని టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలం ఒకే ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
వైసీపీ నేతలు నిత్యం విష ప్రచారం చేస్తూనే ఉన్నారని, మనం ఏం చేస్తున్నామో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎల్లుండి నుంచి ఆరు రోజుల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజెప్పాలని కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇక, తిరుమల వ్యవహారాలపైనా చంద్రబాబు స్పందించారు. గతంలో తిరుమల లడ్డూ నాణ్యతపై తీవ్ర విమర్శలు వచ్చాయని గుర్తుచేశారు. గతంలో వెంకటేశ్వరస్వామి పవిత్రతను దెబ్బతీశారని, తిరుమల అన్నదానంలో నాణ్యత పాటించలేదని ఆరోపించారు.దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసేలా నాసిరకం పదార్థాలు వాడారని మండిపడ్డారు. దేవుడి ప్రసాదంలో నెయ్యికి బదులు, జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి ప్రసాదానికి స్వచ్ఛమైన నెయ్యి వాడాలని చెప్పామని, ప్రస్తుతం దేవుడి ప్రసాదం నాణ్యత పెరిగిందని వెల్లడించారు. వెంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article