బూటకపు ప్రసంగాలు కాదు…దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు జగన్ సిద్దమా? జగన్ సిద్దం అని సభలు పెట్టి…అశుద్దం మాటలు చెపుతున్నాడు 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క చాన్సే జగన్ కు రాజకీయంగా చివరి చాన్స్ వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచెయ్యడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారు ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని జగన్ మడతపెట్టాడు…మిగిలిన వాళ్లను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారు రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్ సంక్షేమ గురించి చెప్పడమా? రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ది కాదు…ఏ ఊరుకెళ్లినా నీ 5 ఏళ్ల పాలనా విధ్వంసం కనిపిస్తోంది సిఎం వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కౌంటర్
అమరావతి:- రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ఆరాచక, విధ్వంస పాలనపై సీఎంతో చర్చకు తాను సిద్ధం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వందల కోట్లు ఖర్చు చేస్తూ….అధికార దుర్వినియోగంతో సిద్ధం అని సభలు పెడుతూ జగన్ చెబుతున్న అసత్యాల నిగ్గుతేల్చేందుకు తాను సిద్ధం అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు కాదు…దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు జగన్ సిద్దమా? ఏ అంశం మీదైనా..ఎక్కడైనా, ఏ రోజైనా చర్చకు నేను సిద్దమే అని చంద్రబాబు అన్నారు. ఎవరి పాలన స్వర్ణయుగమో…ఎవరి పాలన రాతియుగమో చర్చిద్ధాం..చర్చకు వచ్చే దమ్ముందా జగన్ అంటూ సవాల్ చేశారు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్కఛాన్సే జగన్ కు చివరి ఛాన్స్ కానుందని అన్నారు. ఓటమిపై జగన్ కు స్పష్టత రావడంతో మళ్లీ ప్రజలను ఏమార్చడానికి పరదాలు కాస్తా పక్కకు జరిపి ఎన్నికల ముందు రోడ్డెక్కాడని చంద్రబాబు దుయ్యబట్టారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్ సంక్షేమ గురించి చెప్పడమా? సహజ వనరుల దోపిడీతో, స్కాం కోసమే స్కీం పెట్టిన విధానాలతో అత్యంత ధనిక ముఖ్యమంత్రి గా మారిన జగన్….పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ పాలనలో ఏ మూలన చూసినా అభివృద్ది కాదు…ఏ ఊరుకెళ్లినా జగన్ 5 ఏళ్ల విధ్వంసం పాలనతో నష్టపోయిన ప్రజలు కనిపిస్తున్నారని చంద్రబాబు అన్నారు. సిద్ధం అని సభలు పెడుతూ జగన్ నోటి వెంట అశుద్ధ పలుకులు పలికాడని చంద్రబాబు తీవ్రంగా మండి పడ్డారు.
• ఓటమి భయంతో 77 మంది ఎమ్మెల్యేలను బదిలీలు అంటూ జగన్ ఇప్పటికే మడతపెట్టాడని…మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలను మోసం చేసి…సామాజిక ద్రోహం చేసిన జగన్..సామాజిక న్యాయం అనే పదం పలికే అర్హతే లేదని అన్నారు. జగన్ చెప్పినట్లు రేపు ఎన్నికల్లో ప్రతి బాధిత కుటుంబం వైసీపీని ఓడించేందుకు స్టార్ క్యాంపెయినర్ కాబోతోందని అన్నారు.
• రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ఆర్.టి.సి, స్కూల్ బస్సుల్ని లాక్కొని జనాన్ని బలవంతంగా రాప్తాడు సభకు తరలించారు. సభ నిజంగా సక్సెస్ అయ్యి ఉంటే జగన్ రెడ్డి రౌడీ గ్యాంగ్ వార్తలు కవర్ చేసే మీడియా సిబ్బందిపై ఫ్రస్టేషన్ తో దాడులు ఎందుకు చేశారు అని ప్రశ్నించారు.
• వచ్చే ఎన్నికలు నిజమైన పెత్తందారు జగన్ కు 5 కోట్ల ప్రజలకు మధ్య యుద్ధం అని అన్నారు. టీడీపీ తెచ్చిన 120 సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి జనం కసితో ఉన్నారని అన్నారు. ఎస్.సి., ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్ల రూపాయలు దారి మళ్లించిన జగన్ పై పేదలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
• తెలుగుదేశం పేరు, నా పేరు చెబితే దళితులకు ఇచ్చిన సబ్ ప్లాన్ నిధులు, ఇన్నోవా కార్లు, నిరుద్యోగ భృతి, 11 డిఎస్సీలతో ఇచ్చిన 1.50 లక్షల టీచర్ పోస్టులు, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, అమరావతి, 16 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు గుర్తుకు వస్తాయి అని చంద్రబాబు గుర్తు చేశారు. మహిళల కోసం 22 పథకాలు తెచ్చిన పార్టీ టీడీపీ అన్నారు.
• జగన్ రెడ్డి పేరు చెబితే బాబాయిపై గొడ్డలి వేటు, కోడికత్తి శీను, ప్రభుత్వ టెర్రరిజం, క్విడ్ ప్రోకో, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా గుర్తొస్తాయన్నారు. జగన్ పేరు చెపితే అధిక ధరలు, పన్నులు, ఛార్జీల పెంపు, అప్పులు, బాదుడు, మోసాలు, దొంగ ఓట్లు, హింసా రాజకీయాలు గుర్తొస్తాయని దుయ్యబట్టారు.
• మ్యానిఫెస్టోలో మద్య నిషేధం అని చెప్పి…తరువాత దాన్ని మద్య నియంత్రణ అని మార్చి..రూ.1.50లక్షల కోట్ల మద్యం అమ్మిన జగన్ విశ్వసనీయత గురించి చెపితే జనం నమ్మాలా అని ప్రశ్నిచారు. 98 శాతం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు అని జగన్ చెపుతున్న మాటలు పూర్తిగా బూకటం అని….ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాధుడుతో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపడం నిజం అని అన్నారు. నిన్నటి వరకు పరదాల్లో తిరిగిన జగన్….9 సార్లు కరెంట్ చార్జీలు పెంచిన జగన్….పేదల గురించి ఎన్నికల సమయంలో మాయ మాటలు చెపుతున్నాడని ఎద్దేవా చేశారు.
• రైతు భరోసాలో జగన్ ఇచ్చింది రూ.37వేలు మాత్రమే. రైతు రుణమాఫీ ద్వారా ఒకే సారి మేం రూ.50 వేలు ఇచ్చింది వాస్తవం కాదా…ఎన్నికల సమయంతో మిగిలిన మొత్తం అందకుండా నాడు జగన్ కుట్రలు చేసింది నిజం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను రివర్స్ చేసి, రైతుల సబ్సిడీల నిలిపివేసిన జగన్ కు అసలు రాయలసీమలో సభ పెట్టే అర్హతే లేదని అన్నారు.
• విభజన అనంతరం తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అనేక అడ్డంకులు సవాళ్ళు అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళితే…. జగన్ తన విధ్వంస పాలనతో విభజన కంటే ఎక్కువ నష్టం చేశారని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో 14 శాతం ఉండే వృద్ధిరేటు…ఈ ప్రభుత్వం వచ్చాక 10.93 శాతానికి పడిపోయిందని, వైసీపీ ప్రభుత్వ హయంలో వృద్ధి రేటు 4.06 శాతం తగ్గింది, టాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఏడాదికి రూ.30 వేల కోట్లు ఆదాయానికి గండి పడిందన్నారు. విభజన జరిగినప్పుడు మనకంటే తెలంగాణ 35 శాతం అధికంగా తలసరి ఆదాయం ఉంటే…2014 తర్వాత ఏపీలో సుపరిపాలన ద్వారా వ్యత్యాసాన్ని 27.5 శాతానికి తగ్గించామని వివరించారు. ఇప్పుడు జగన్ నిర్వాకం వల్ల ఏపీ తలసరి ఆదాయం తెలంగాణతో పోల్చితే 44 శాతం తక్కువగా ఉందని, అభివృద్ధి లేక ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోవడమే దీనికి కారణం అని చంద్రబాబు అన్నారు.
• రాష్ట్రంలో అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం తప్ప జగన్ సాధించింది శూన్యం అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేకే కేసులతో వేధిస్తున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై తాజాగా కేసు పెట్టడాన్ని ఆయన ఈ సందర్భంగా ఖండిచారు. జగన్ కేసులు పెట్టినా….దాడులు చేసినా ప్రశ్నించే గళాలను అణిచివేయలేడని…ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని….తమ జీవితాలు నాశనం చేసిన ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి జనంతో కసితో ఉన్నారని చంద్రబాబు నాయుడు అన్నారు.