ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఇవాళ ఓ లేఖ రాశారు. ఈ ఐదేళ్ల కాలంలో తనపై పోలీసులు పలు చోట్ల నమోదు చేసిన కేసుల వివరాల్ని చంద్రబాబు కోరారు.ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ అభ్యర్ధీ తనపై నమోదైన కేసుల వివరాలను నామినేషన్ సమయంలో ఇచ్చే అఫిడవిట్ లో పొందుపర్చాల్సి ఉంటుందని, ఈసీతో పాటు ప్రజలకూ వీటి వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో తెలిపారు. ప్రభుత్వంపై పోరాడే క్రమంలో తనపై రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో, వివిధ దర్యాప్తు సంస్ధలు నమోదు చేసిన కేసుల వివరాలు ఇవ్వాలని చంద్రబాబు డీజీపీని కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దిగా, మాజీ సీఎంగా, విపక్ష నేతగా తన బాధ్యతలు నిర్వర్తిచాలంటే 2019 జనవరి 1 నుంచి తనపై నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణాన అయినా విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ వివరాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఏ వ్యక్తికీ తనపై పోలీసులు, దర్యాప్తు సంస్ధలన్నీ నమోదు చేసిన అన్ని కేసుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఆధీకృత సంస్ధగా మిమ్మల్ని ఈ వివరాలు అడుగుతున్నానని చంద్రబాబు తెలిపారు. ఇందులో ఎలాంటి ఆలస్యం జరిగినా ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమవుతుందని డీజీపీకి తెలిపారు.