ఆర్టీజీ ద్వారా పౌరసేవలను సులభతరం చేయడం…
పాలనలో వేగం పెంచడంపై
అధికారులతో చర్చ
ఆర్టీజీ ద్వారా మెరుగైన సేవలు అందించే ప్రాజెక్టును 100 రోజుల్లో సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం
అమరావతి:-
అమరావతి:- సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఈ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టింది. 2024లో ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తరవాత తొలి సారి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీ సెంటర్ ను సందర్శించారు. ప్రస్తుతం ఈ కేంద్రం పనితీరును సమీక్షించారు. అనంతరం సిఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో ఆర్టీజీ కేంద్ర కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమావేశం అయ్యారు. ఆర్టీజీ ద్వారా పౌరసేవలను సులభతరం చేయడం…పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చంచారు. రానున్న రోజుల్లో ఆర్టీజీ ద్వారా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. సిఎం మాట్లాడుతూ “ప్రజలకు సంబంధించిన మాస్టర్ డాటాను ఆర్టీజీ కేంద్రంగా అన్ని శాఖలు ఉపయోగించుకుని సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలి. ఆధార్, వాక్సినేషన్ డాటా, స్కూల్ అడ్మిషన్, రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు, మ్యారేజ్ సర్టిఫికెట్, ఇతర సర్టిఫికెట్ల వంటి కార్యక్రమాలు ప్రజలకు ఆటోమేటిగ్ గా అందేలా పాలసీలు రూపొందించి అమలు చేయాలి. పారిశుధ్యం, ట్రాఫిక్, ప్రమాదాలు, నేరాలు, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పంట కాలువల నిర్వహణ, అగ్రికల్చర్, వరదలు, భారీ వర్షాలు, విపత్తులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎలా పనిచెయ్యవచ్చో అనే అంశంలో ప్రణాళిక సిద్దం చేయాలి అని ముఖ్యమంత్రి సూచించారు. సిసి టీవీ కెమేరాలు, డ్రోన్లు వంటి వాటి ద్వారా డాటా విశ్లేషణ, ప్రభుత్వ సేవల అందజేత, రియల్ టైంలో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రియల్ టైం గవర్నెస్ ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడంపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్ట్ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.