గాజువాక:
పోరాటాలపై ఉక్కు పాదం మోపుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల16 న జరిగే సమ్మెను జయప్రదం చేయండి అని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్ పిలుపునిచ్చారు. సమ్మె ప్రాధాన్యతను వివరిస్తూ స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ వర్కర్ ను నేడు ప్లాంట్ లోని స్టోర్ జంక్షన్ వద్ద విడుదల చేశారు.
ఈ సందర్భంగా జె అయోధ్యరామ్ మాట్లాడుతూ నేడు రైతులు తమ పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇమ్మని గడచిన రెండు సంవత్సరాలుగా వేచి ఉన్నప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడానికి ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ విధానాలతో విసిగి చెందిన రైతులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడితే తీవ్ర నిర్బంధాన్ని ఉపయోగించి వారిని అణిచివేయాలని చూడడం దుర్మార్గమని ఆయన అన్నారు. పోరాటాలను అహాస్యం చేస్తూ కమిటీ వేసి చర్చిస్తామని చెప్పడం వల్ల ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన రైతులు ఉద్యమానికి దిగారని ఆయన వివరించారు. ఈ ఉద్యమంలో కార్మిక కర్షక మైత్రిని ప్రతిబింబించే విధంగా సమ్మె ద్వారా ప్రభుత్వ విధానాలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి కార్మిక సమస్యలను కార్మిక సంఘాలతో చర్చించడానికి గడచిన ఐదు సంవత్సరాల కాలం సరిపోలేదని ఆయన ఎద్దేవా చేశారు. బిజెపి ప్రభుత్వానికి కార్మిక సమస్యల కంటే పెట్టుబడిదారులకు ఎలా ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలను అప్పజెప్పడం మీదే దృష్టి ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు. గడచిన మూడు సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ 100% వ్యూహాత్మక అమ్మకానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని ఆయన వివరించారు. ఇదే సమయంలో కార్మికుల హక్కుగా ఉన్న నూతన వేతనాలు అమలు చేయకుండా స్థానిక యాజమాన్యం వ్యవహరించడానికి ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సమ్మె ద్వారా మనలను మనం కాపాడుకోవడం మన హక్కులను రక్షించుకోవడం కోసం జరుగుతోందని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ సీఐటీయూ ప్రతినిధులు పి శ్రీనివాసరాజు, బి అప్పారావు, కృష్ణమూర్తి, బి మహేష్, శ్రీనివాసరెడ్డి, డి సత్యనారాయణ, దుర్గాప్రసాద్, విడివి పూర్ణచంద్ర రావు, మధు, మురళి తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.