సీఎం రేవంత్ హెచ్చరిక
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ నిర్మాణాలపై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రాజెక్టుల వద్ద అక్రమంగా ఫాంహౌస్‌లు నిర్మించి, డ్రైనేజీ వ్యవస్థను గండిపేటలో కలుపుతున్న వారి మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి నిర్మాణాలను వదిలిపెట్టబోమని, కూల్చివేయడం తప్పదని స్పష్టం చేశారు. నిబంధనలను పట్టించుకోకుండా నిర్మాణాలు చేసేవారు కోర్టులకు వెళ్లినా, ప్రభుత్వం వీటిని అడ్డుకోడానికి పోరాటం చేస్తుందని చెప్పారు.వరదలు పేదల ఇళ్లను ముంచెత్తుతున్నట్లు, నాలాలపై ఆక్రమణల వల్లనే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల తొలగింపునకు హైడ్రా మిషన్‌ను ప్రారంభించారని, చెరువులు, నాలాలను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నామని వివరించారు.మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు ప్రకటించిన రేవంత్, ఆ ప్రాంతంలోని 11 వేల నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గురించి మాట్లాడుతూ, కమిషన్ పకడ్బందీగా, పారదర్శకంగా పనిచేస్తోందని, ఇప్పటికే 30,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, మరింతగా 35,000 ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.