ఒంగోలు:ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు సీఎం జగన్ . ఈ సభలో జగన్ ప్రసంగిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. వందమంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే ఒక్క చంద్రబాబు దుర్మార్గం ఎక్కువని అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అన్ని దుర్మార్గాలు చేస్తూ కూడా భయం, బెరుకు లేకుండా చంద్రబాబు ఉన్నారన్నారు. పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తుంటే కొంతమంది రాక్షసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు, టీడీపీ వాళ్లు కోర్టుల్లో 1191 కేసులు వేస్తున్నారన్నారు. బాబు సృష్టించిన న్యాయపరమైన అడ్డంకులను దాటుకుంటూ వచ్చామని, ఈ రోజున పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం ద్వారా 3 లక్షల కోట్ల ఆస్తిని పంచుతున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పేదలకు ఒక్క సెంటు కూడా ఇళ్ల స్థలం ఇవ్వలేదు.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు ఓర్వడం లేదు అని ఆరోపించారు. ఈ క్రమంలోనే జగన్.. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశాం.. ఇంటింటికీ తలుపు తట్టి ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం.. అందరికీ ఒకటే రూల్స్ ఉండాలని నిబంధనలు మార్చాం అని తెలిపారు. “అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం. మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది. పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం. ఆర్థిక అంతరాలు తొలగించాం.రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు. రిజిస్ట్రేషన్ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలు కుదరదు. గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్ కాపీలు. రిజిస్ట్రేషన్ బ్యాంక్ డాక్యుమెంట్లు ఉండడం వల్ల సులభంగా బ్యాంకు రుణాలు అందుతాయి” అని అన్నారు.గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇచ్చారని, తమ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులిచ్చామని అన్నారు జగన్. గత ప్రభుత్వానికి , వైసీపీ ప్రభుత్వానికి తేడా గమనించాలని, పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదని అన్నారు. “పేదల సంక్షేమం కోసం ప్రతీ అడుగు వేశాం. పేదలకు ఒక న్యాయం , పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదు. అందరికీ ఒకటే రూల్స్ ఉండాలన్నది మా లక్ష్యం” అని తెలిపారు. చంద్రబాబు భార్యే కుప్పం వెళ్లి బైబై అంటున్నారన్నారు. ఎన్నికల సంగ్రామంలో తాము సిద్ధం అంటుంటే.. చంద్రబాబు భార్య మాత్రం ఆయన సిద్ధంగా లేరని చెబుతున్నారని జగన్ అన్నారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రులు మాత్రమే బాబు ని సమర్థిస్తున్నారన్నారు.
ఈ జగన్ మీ బిడ్డ. నా వల్ల, మా ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి. నేను నమ్ముకుంది మిమ్మల్ని, దేవుడ్ని. చంద్రబాబులాగా నేను దళారీలను నమ్ముకోలేదు. చంద్రబాబు వంటివారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి. కుప్పం నుంచే బాబు బై బై అంటున్నారు… చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మడంలేదు. మనం సిద్ధం అంటుంటే బాబు అర్ధాంగి సిద్ధంగా లేమని అంటున్నారు అని సీఎం జగన్ అన్నారు.