ఓ మనిషీ..
నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు నీలాంటి ఓ మనిషిలో
దేవుడిని
నీ ఎదురుగా
రోజూ తిరిగే
భగవంతుడిని..
దుష్టశిక్షణకు,శిష్టరక్షణకు
ఉపక్రమించి భూమిపైకి దిగివచ్చిన దేవుడే
మనిషి గొప్పదనాన్ని గుర్తించి
మానవ రూపంలోనే..
వైద్యుడిగానే
అరుదెంచ లేదా..
రాముడని, కృష్ణుడని
నీ పూజలందుకోవడం లేదా..!
కరోనా విలయతాండవం
చేసిన వేళ
ఊరూరా దేవుళ్ళు..
గుళ్ళలో కాదు..
ఆస్పత్రులలో
డాక్టర్ బాబులుగా,
నర్సులుగా,ఆయాలుగా..
వారి ప్రాణాలను ఫణంగా పెట్టి
ఇంటిపై ధ్యాస వదిలిపెట్టి
ఫోనులో ఛాటింగులూ
విడిచిపెట్టి..
మాస్కులు కూడా రిస్కుల నుంచి కాపాడలేని
గడ్డు స్థితిలో
నీ ప్రాణాలకు
వారి ప్రాణాలను అడ్డుపెట్టిన
వైద్య నారాయణులు.. స్టెతస్కోపు భూషణులు..!
దిక్కు లేని వారికి
వైద్యుడే దిక్కై..
నీ రక్షకుడై..లోక రక్షకుడై..!
ఫీజులు..
చెడు రోజులు
అంటూ గగ్గోలు పెట్టకు..
దోచేది కొందరే..
కాచేది ఎందరో..
ఒక్కొక్కరిది ఒక్కో గుణం..
ఏమిచ్చినా..ఎంతిచ్చినా
తీర్చలేనిది ప్రాణం కాపాడే
వైద్యుడి రుణం..
దేవుడికైతే గుడిలో దీపం..
డాక్టరుకు ప్రతి గుండె
గుడిలో దీపమే..!
డాక్టర్స్ డే సందర్భంగా
ప్రతి వైద్యుడికి నమస్సులతో..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286