క్యాన్సర్ అనగానే వెన్నులో వణుకుపుడుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఎంతో మంది క్యాన్సర్ బారిన పడి చనిపోతుండటం చూస్తూనే ఉన్నాం. క్యాన్సర్లు ఎన్నో రకాలుంటాయి. వాటిలో మనకు చాలా తెలిసినవే. కానీ చాలా మందికి చీర క్యాన్సర్ గురించి మాత్రం తెలియదు. కానీ ఇది ఆడవాళ్లకు ముప్పుగా మారింది. అసలు చీర క్యాన్సర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వేరే దేశాల సంగతి పక్కన పెడితే.. మన ఇండియన్ ఆడవాళ్లకు చీరలంటే చాలా మక్కువ. రకరకాల చీరలను కొంటూ కట్టుకుంటూ మురిసిపోతుంటారు. ఈ చీరలు ఐదున్నర నుంచి ఆరు మీటర్ల పొడవు వరకు ఉంటాయి. నచ్చిన రంగు, ఫ్యాబ్రిక్ లో కనిపిస్తే చాలు ఆడవాళ్లు ఆ చీరను పక్కాగా కొంటుంటారు. కానీ ఆడవాళ్ల అందాన్ని పెంచే ఈ చీరలు క్యాన్సర్ కు కారణమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అవును చీరల వల్ల క్యాన్సర్ కూడా వస్తుందని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. ఇదొక్కటే కాదు వేరే దుస్తులను కూడా తప్పుగా ధరిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చీర క్యాన్సర్ భారతదేశంలో మాత్రమే కనిపిస్తుందట. ఎందుకంటే భారతదేశంలోనే ఆడవాళ్లు చీరలు ఎక్కువగా కట్టుకుంటారు.
మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఆడవాళ్లు ప్రతి రోజూ చీరలు కట్టుకుంటారు. చీర కట్టుకోవాలంటే కాటన్ పెటికోట్ ను ధరించాలి. దీన్ని ఆడవాళ్లు నడుము చుట్టూ చాలా గట్టిగా కట్టుకుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎక్కువసేపు ఇలా టైట్ గా ఉండే దుస్తులను ధరించడం వల్ల నడుము చర్మం దెబ్బతింటుంది. చర్మం నల్లగా మారుతుంది. రోజూ ఇలా కావడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ ను వైద్య పరిభాషలో స్క్వామన్ సెల్ కార్సినోమా అంటారు.
నిజానికి చీర క్యాన్సర్ చీరల వల్ల కాదు పరిశుభ్రత లేకపోవడం వల్ల వస్తుంది. ఈ క్యాన్సర్ ఎక్కువ వేడి, తేమ వల్ల వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ చీర క్యాన్సర్ కేసులు ఎక్కువగా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. మన దేశంలో నమోదయ్యే క్యాన్సర్లలో చీర క్యాన్సర్ కేసులు 1 శాతంగా ఉన్నాయి.
ఈ చీరక్యాన్సర్ పై ముంబైలోని ఆర్ఎన్ కూపర్ హాస్పిటల్లో కూడా పరిశోధనలు జరిగాయి. అయితే ఈ పరిశోధన్లో చీరతో పాటుగా ధోతీని కూడా చేర్చారు. బాంబే హాస్పటల్ డాక్టర్లు.. 68 ఏండ్ల మహిళకు చీర క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. వాళ్లే దీనికి చీర క్యాన్సర్ అని పేరు పెట్టారు. ఈ క్యాన్సర్ వచ్చిన మహిళ 13 ఏండ్ల వయసు నుంచి చీర కట్టడం మొదలుపెట్టిందట.
పరిశోధకులు కాశ్మీర్ లో కాంగ్రీ క్యాన్సర్ కేసులను గుర్తించారు. ఇది స్కిన్ క్యాన్సర్ అని నిపుణులు అంటున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ క్యాన్సర్ కేసులు ఒక్క కాశ్మీర్ లో మాత్రమే నమోదయ్యాయి. ఈ క్యాన్సర్ వేడి వల్ల వస్తుంది. ఇక్కడి ప్రజలకే ఇది ఎందుకు వస్తుందటే.. ఈ ప్లేస్ లో చాలా చల్లగా ఉంటుంది. దీంతో ప్రజలు వెచ్చదనం కోసం ఎప్పుడూ నిప్పును వెలిగిస్తారు. వాటిచుట్టూ కూర్చుంటారు. కానీ ఈ వేడి కడుపు, తొడలకు బాగా తగిలి క్యాన్సర్ కు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.
ఇకపోతే పురుషులకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా చాలా టైట్ గా జీన్స్ ను వేసుకునే వారికి. పరిశోధకుల ప్రకారం.. టైట్ గా ఉండే దుస్తులను గంటల తరబడి వేసుకుంటే శరీరానికి ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే టైట్ గా దుస్తులను వేసుకోవడం వల్ల ఆ భాగాలకు రక్తం, ఆక్సిజన్ లు సరిగ్గా సరఫరా కావు. పలు పరిశోధనల ప్రకారం.. మగవారు టైట్ జీన్స్ ను వేసుకోవడం వల్ల వారికి పొత్తికడుపు దిగువ ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. దీనివల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గుతుంది. అంతేకాదు దీనివల్ల వృషణ క్యాన్సర్ వస్తుంది. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమంటున్నారు నిపుణులు. క్యాన్సర్ బారిన పడొద్దంటే మీరు టైట్ గా ఉండే ఇన్నర్ వేర్ లు, జీన్స్ లను వేసుకోకుండా ఉండాలి. టైట్ దుస్తుల వల్ల క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం మేలు.