పులివెందుల టౌన్
రైతులు పండించిన పంట దిగుబడులకు మంచి ధర లభించెందుకే ఈ- నామ్ వ్యవస్థ ఉపయోగపడుతుందని ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు సి.రామాంజనేయులు తెలిపారు. పులివెందుల లోని మార్కెట్ యార్డ్ ఆవరణలో చీనీ కాయల క్రయ, విక్రయాలలో ఈ- నామ్ వ్యవస్థ అమలు చేసేందుకు రైతులు, వ్యాపారులు, రైతు ఉత్పత్తి సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ- నామ్ వ్యవస్థలో రైతులు, వ్యాపారులు ఆన్ లైన్ వివరాలు నమోదు చేసుకుని ఉంటారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలోని ధరలు చూసుకునే వీలు ఉంటుందని తెలిపారు. ఈ వ్యవస్థ వలన సమయం ఆదా అవడం తో పాటు రైతుల పంట దిగుబడులకు త్వరిత గతిన డబ్బులు చెల్లించే వీలు ఉంటుందని వివరించారు. ఇందులో ఎటువంటి మోసాలకు అవకాశం ఉండదని తెలిపారు. యార్డ్ కు అధిక సంఖ్యలో రైతులు చీనీకాయలు తీసుకువచ్చినపుడు ప్రస్తుతము నిర్వహిస్తున్న బహిరంగ వేలము వలన సమయము వృథా అవడం తో పాటు అటు రైతులు, వ్యాపారులు, సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలను ఈ- నామ్ వ్యవస్థలో అధిగమించవచ్చునని తెలిపారు. పులివెందుల లోని చీనీకాయల మార్కెట్ లో కూడా ఈ- నామ్ వ్యవస్థ నిర్వహించేందుకు ఉన్నతాదికారులు చర్యలు తీసుకుంటున్నారనీ తెలిపారు. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రాంతీయ ఉప మార్కెటింగ్ సంచాలకులు బి.శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పంట దిగుబడుల క్రయ, విక్రయాలకు ఈ- నామ్ వ్యవస్థ ఎంతగానో లాభదాయకంగా ఉంటుందని వివరించారు. రైతుల పంట దిగుబడులకు ఆన్ లైన్ ద్వారా ఖచ్చితంగా డబ్బులు జమ అవుతాయని తెలిపారు. జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ అధికారి ఆజాద్ వలి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి కార్యదర్శి వి. శ్రీధర్ రెడ్డి, పర్యవేక్షకులు రామ కృష్ణ,సహాయ మార్కెట్ పర్యవేక్షకులు అరుణ్ కుమార్, లావణ్య, రైతులు పాల్గొన్నారు.