మన చుట్టూ వైరస్ లు, బ్యాక్టీరియాలు, ఫంగస్ లు వంటి సూక్ష్మజీవులెన్నో. మనం తాకే ప్రతిచోటా ఈ సూక్ష్మక్రిములు ఉంటుంటాయి. వివిధ మార్గాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంటాయి. అలా ప్రవేశించిన సూక్ష్మక్రిములను మన శరీరంలోని రోగ నిరోధక కణాలు గుర్తించి, దాడి చేసి నిర్మూలిస్తాయి. అలా రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ పది రకాల ఆహారం బాగా తోడ్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నిమ్మకాయ…నిమ్మ రసంలో ఉండే విటమిన్ సి సూక్ష్మక్రిములను నిర్మూలించగలదు. అదే సమయంలో నిమ్మరసం శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలను తొలగించి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. జీర్ణ వ్యవస్థనూ మెరుగు పరుస్తుంది.
పసుపు…మనం వంటల్లో వాడే పసుపులో ఉండే కర్క్యుమిన్ అద్భుతమైన ఔషధమనే చెప్పవచ్చు. దీనికి సూక్ష్మక్రిములను సంహరించే, శరీరంలో ఇన్ ఫ్లమేషన్ (వాపు)ను తగ్గించే లక్షణాలు ఉన్నాయి.
లవంగాలు…లవంగాలలో ఉండే యూజెనాల్ అనే రసాయన పదార్థానికి సూక్ష్మజీవులను నిర్మూలించే సామర్థ్యం ఎక్కువ. బ్యాక్టీరియాలు, వైరస్ లతో సమర్థవంతంగా పోరాడేలా రోగ నిరోధక వ్యవస్థకు తోడుగా నిలుస్తుంది. అంతేకాదు నోటి ఇన్ఫెక్షన్లను, గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
దాల్చిన చెక్క…దాల్చిన చెక్కలో ఉండే సిన్నమాల్డిహైడ్ రసాయనం అద్భుతమైన సూక్ష్మక్రిమి నాశినిగా పనిచేస్తుంది. ఎన్నో ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
వెల్లుల్లి..వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే రసాయనం సహజమైన యాంటీ బయాటిక్ గా పనిచేస్తుంది. బ్యాక్టీరియాలు, వైరస్ లను నిర్మూలించడమే కాదు… జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
అల్లం ..ఇది కూడా సహజమైన యాంటీ మైక్రోబియల్ ఆహారం. ముఖ్యంగా శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి, జీర్ణ వ్యవస్థ మెరుగుపడటానికి తోడ్పడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.
తులసి..మనం ఎంతో పవిత్రంగా భావించే తులసి… అద్భుతమైన ఔషధమనే చెప్పవచ్చు. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడమే కాదు… జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎన్నింటితో తగ్గిస్తుంది.
తేనె..సహజమైన తేనెకు యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ సామర్థ్యం ఉంటుంది. ఇందులోని పదార్థాలు ఎన్నో ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. గాయాలను త్వరగా మానిపోయేలా చేస్తాయి.
వేప..ఆయుర్వేదంలో విస్తృతంగా వాడే వేప ఆకులు కూడా ఇమ్యూనిటీకి బాగా తోడ్పడుతాయి. స్వల్ప మొత్తంలో వేప రసాన్ని తీసుకుంటే… రక్తం శుభ్రమవుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి.
మిరియాలు..వీటిలో ఉండే పెపరైన్ అనే రసాయనం కూడా ఇమ్యూనిటీని పెంచి సూక్ష్మక్రిములను నిర్మూలిస్తుంది. వివిధ రకాల పోషకాలను శరీరం సమర్థవంతంగా సంగ్రహించుకోవడానికి తోడ్పడుతుంది.