పవన్ కల్యాణ్, ఈశ్వర్ బి ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖల మధ్య ఆరు అంశాలపై ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌కు దసరా తర్వాత నాలుగు కుంకీ ఏనుగులు ఇవ్వనున్నట్లు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే ప్రకటించారు. వాటి నిర్వహణలో శిక్షణ పొందిన మావటీలను సైతం కొన్నాళ్లపాటు పంపిస్తామని తెలిపారు. విజయవాడలో శుక్రవారం ఏపీ, కర్ణాటక రాష్ట్రాల అటవీశాఖల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే ముఖ్య అతిధులుగా హజరుకాగా, వారి సమక్షంలో కుంకీ ఏనుగులు, పరస్పర సహకార మార్పిడి, స్మగ్లర్లపై నిఘా, ఏకో టూరిజం వంటి ఆరు అంశాల్లో సహకరించుకునేందుకు వీలుగా ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఎంవోయూ చేసుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ తో కలిసి మంత్రి ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. గతంలో కర్ణాటక కూడా మదపుటేనుగులతో తీవ్ర సమస్య ఎదుర్కొందని, కుంకీ ఏనుగులను ఉపయోగించి సమస్యను పరిష్కరించుకోగలిగామని చెప్పారు. పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు వాటిని ఏపీకి అందిస్తున్నామని చెప్పారు. స్మగ్లర్ల ఆటకట్టించేందుకు కర్ణాటక ఉపయోగిస్తున్న సాంకేతికతను ఏపీతో పంచుకుంటామని తెలిపారు. ఏకో టూరిజం అభివృద్ధికి సహకరించుకుంటామని పేర్కొన్నారు. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాకు వివిధ సందర్బాల్లో వెళ్లినపుడు అక్కడ ప్రజలు ఏనుగుల గుంపులు పంట పొలాల మీద పడుతున్నాయని, ఆస్తి నష్టంతో పాటు ప్రాణాలు పోతున్నాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నామని చెప్పారన్నారు.ఇది కేవలం చిత్తూరు జిల్లాలో కాకుండా, రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా సమస్య ఉందన్నారు. తాను అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రజలకు సంబంధించిన ఈ ఏనుగుల సమస్యను ఎలా అధిగమించాలని అధికారుల సమీక్ష సమావేశంలో అడిగాను. దీనికి వారు ఏనుగుల గుంపులను కంట్రోల్ చేయాలంటే కర్ణాటక వద్ద శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల వల్లనే సాధ్యమని చెప్పారన్నారు. వెంటనే కర్ణాటక అటవీశాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ బి.ఖండ్రే తో మాట్లాడితే ఆయన మరో మాట లేకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు.