గొల్లప్రోలు
నిత్యం పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే ఆ రహదారిని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. పెద్దపెద్ద గోతులు ఏర్పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా కనీసం మరమ్మతులు కూడా చేయించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొల్లప్రోలు- తాటిపర్తి పుంత రోడ్డు శిథిలావస్థకు చేరుకుని కొన్ని సంవత్సరాలు గడిచినా అద్వాన స్థితిలో ఉన్న ఈ రోడ్డు పునర్ నిర్మించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టకపోవడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పుంత రోడ్డు తాటిపర్తి, చిన్న జగ్గంపేట, వన్నెపూడి, కొడవలి తదితర గ్రామాలకు దగ్గర దారి కావడంతో నిత్యం వందలాదిమంది ఈ మార్గం కూడా నే రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే రైతులు కూడా తమ పొలంలో పండిన పంటను ఈ మార్గం ద్వారానే గ్రామంలోనికి తరలిస్తారు. రైతులు, రైతు కూలీలు పొలం పనులు చేసుకునేందుకు కూడా ఈ రహదారినే వినియోగిస్తారు. అయితే గత ప్రభుత్వ హయాంలో భారీ గ్రావెల్ టిప్పర్లు రాత్రి పగలు అనే తేడా లేకుండా రాకపోకలు సాగించడంతో ఈ రోడ్డు పూర్తిగా శిథిలమైంది. పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో వర్షాలు కురిసినప్పుడు ఈ గోతులలో నీరు చేరి ఏది గొయ్యో, ఏది రహదారో తెలియక ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి సమయంలో ఈ రహదారిలో ప్రయాణించాలంటే వాహనదారులకు కత్తి మీద సామే. వర్షాకాలంలో నిత్యం రైతులు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు నిర్మాణం సంగతి అటు ఉంచితే కనీసం గోతులు పూడ్చే పనులు కూడా చేపట్టకపోవడంతో స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు స్థానిక రైసు మిల్లు యజమాని, ఇతర వ్యాపారులు కలసి కొంతమేర గోతులు పూడ్చినప్పటికి సుద్ద గడ్డ వరదలకు గోతులలో మట్టి కొట్టుకుపోయి పరిస్థితి మరల మొదటికి కొస్తోంది. యిప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గొల్లప్రోలు- తాటిపర్తి పుంత రోడ్డును పునర్ నిర్మించాలని పలువురు కోరుతున్నారు.