Friday, November 29, 2024

Creating liberating content

టాప్ న్యూస్సంక్షేమం, అభివృద్ధి రెండు క‌ళ్లుగా పాల‌న‌కు శ్రీకారం: సీఎం చంద్ర‌బాబు

సంక్షేమం, అభివృద్ధి రెండు క‌ళ్లుగా పాల‌న‌కు శ్రీకారం: సీఎం చంద్ర‌బాబు

ఐదేళ్ల వైసీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 30ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. పేదల సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం తమ ప్రాధాన్యతలని వెల్లడించారు.సూపర్ సిక్స్‌ హామీల అమలు, పేదల సంక్షేమం, అన్నివర్గాల అభివృద్ధితో పాటు అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం తమ ప్రభుత్వ లక్ష్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 1857కంటే ముందే తెలుగు నేలపై తిరుగుబాటు చేసిన చరిత్ర ఉందని, 1946లోనే విశాలాంధ్ర కోసం పోరాటాలు చేశారని, 1963 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, 1956 నవంబర్ 1న హైదరాబాద్‌ రాజధానిగా ఏపీ మొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. 2014లో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని చెప్పారు.నవ్యాంధ్రకు రాజధానికూడా లేని పరిస్థితుల్లో 2014లో తాను పాలన ప్రారంభించి నట్టు చంద్రబాబు చెప్పారు. కూర్చోడానికి సరైన స్థలం కూడా లేని ప్రదేశం నుంచి పనిచేయాల్సి వచ్చిందన్నారు.గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 9.74లక్షల కోట్లకు చేరాయన్నారు. గత ప్రభుత్వ విధానంతో ప్రజల తలసరి ఆదాయం కూడా గణనీ యంగా తగ్గిపోయిందన్నారు. పేదలకు ఉపయోగపడే పనులు ఏమి గత ప్రభుత్వం చేయలేదన్నారు.
స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ పేరుతో రైతు బజార్లు, కలెక్టరేట్లను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారన్నారు. గత ప్రభుత్వ విధానాలతో విసుగు చెందిన ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అసాధారణంగా కూటమికి పట్టం కట్టారన్నారు. 57శాతం ఓటు షేరుతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు.అహంకార, విధ్వంసక ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలన్న మోదీ, పవన్, తాను ఇచ్చిన పిలుపుకు ప్రజలు విశ్వసించారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఐదేళ్ల తర్వాత ఏపీ ప్రజలకు స్వాతంత్య్రం లభించిందని చెప్పారు.సంస్కరణలకు మానవీయ థృక్పథాన్ని జోడించి పాలనకు శ్రీకారం చుట్టామన్నారు. 100రోజుల ప్రణాళిక టార్గెట్‌గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నట్టు చెప్పారు. అన్ని శాఖల్లో నూతనోత్సాహం తీసుకొచ్చి పాలన సాగిస్తున్నామన్నారు.హంగు ఆర్భాటాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా పాలన అందిస్తున్నామని బాబు చెప్పారు. సమాజమే దేవాలయం అనే నందమూరి రామారావు ఇచ్చిన నినాదంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టు చెప్పారు. నాడు నేడు మాయ మాటలు చెప్పి గత ప్రభుత్వం విద్య రంగాన్ని తీవ్ర అగాథంలోకి నెట్టేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఒక్క టీచర్ పోస్ట్‌ కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశారని ఆరోపించారు. 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్రాన్ని తీవ్ర అంధకారంలోకి నెట్టిందన్నారు. 2019లో టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే పోలవరం నిర్మాణం పూర్తై ఉండేదన్నారు.2024లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సీపై సంతకం చేసినట్టు చెప్పారు. ఇప్పటికే డిఎస్సీ నియామక ప్రక్రియ ప్రారంభించినట్టు చెప్పారు. గత ఐదేళ్లలో ఎప్పుడు లేని విధంగా భూకబ్జాలు, రీ సర్వేతో కొత్త కష్టాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారని చెప్పారు.ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెన్షన్లు పెంచినట్టు చెప్పారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పెంచలేరంటూ నాటి ప్రభుత్వం 36మంది చావులకు కారణమైందన్నారు. తాము ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచామని పెన్షన్ల కోసం ప్రతి నెల రూ.2700 కోట్లు, ఏటా రూ.33వేల కోట్లు పెన్షన్లకు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. ఐదేళ్లలో పెన్షన్ల కోసం లక్షా 64వేల కోట్లను పెన్షన్లకు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు.
గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఇసుకను బుక్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగమంటే ప్రభుత్వంలో భాగమని, ప్రభుత్వ ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన జీతాలు సమయానికి రాలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకటో తేదీన వారి ఖాతాల్లో జీతాలు పడుతున్నాయని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగుల్లో ఆనందాన్ని చూడగలుగుతున్నట్టు చెప్పారు.సూపర్‌ సిక్స్‌లో ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాడే నాటికి రాష్ట్ర పరిస్థితి ప్రజలకు వివరించేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడు అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేసినట్టు చెప్పారు.కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు చేసినందుకు, పోలవరం నిర్మాణానికి హామీ ఇచ్చినందుకు, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు చేసినందుకు చంద్రబాబు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 2న గాందీ జయంతి సందర్భంగా విజన్ 2047 విడుదలకు రూపకల్పన చేసినట్టు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article