• గ్రామ సభ గురించి 2 రోజులు ముందుగానే దండోరా వేసి ప్రజలకు తెలియజేయాలి
• ఉపాధిహామీ కింద ఏడాదిలో 100 రోజులు పని దినాల కల్పనపై అవగాహన తేవాలి
• 2024-25 సం.రం లో చేపట్టే ఉపాధిహామీ పనులపై గ్రామసభ ఆమోదం తీసుకోవాలి
• గ్రామసభలు అర్దవంతంగా జరగాలంటే ప్రజలు,అధికారులు మనస్పూర్తిగా పాల్గోవాలి
• గ్రామ సచివాలయాల్లో పనిచేసే అందరు ఉద్యోగులు భాగస్వాములు కావాలి
• సమిష్టిగా పనిచేసి ఉపాధిహామీ పనుల అమలులో దేశంలో అగ్రగామిగా నిలుద్దాం
• ఉపాధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దు
ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్
అమరావతి,19 ఆగస్టు:ఈనెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13వేల 326 గ్రామ పంచాయితీల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒకేరోజు గ్రామ సభలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కె.వపన్ కళ్యాణ్ వెల్లడాంచారు.గ్రామ సభలపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా పరిషత్ సిఇఓలు,డిపిఓలు, డ్వామా పిడిలు,ఎంపిడిఓలు తదితర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి గ్రామ సభలు విజయవంతానికి తీసుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పంచాయితీరాజ్,గ్రామీణాభివద్ధి శాఖల్లో పనిచేయడ మంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు,నిరుపేద కూలీలకు సేవ చేయడమేనని తాను నమ్ముతున్నాని అన్నారు.పంచాయితీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయితీ నుండి జిల్లా పరిషత్ వరకూ పటిష్టంగా ఉన్నప్పుడే అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతామని తద్వారా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించ గలుగుతామని పేర్కొన్నారు.దానిలో భాగంగానే ఈనెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13వేల 326 గ్రామ పంచాయితీల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందుని తెలిపారు.ముఖ్యంగా ఉపాధిహామీ పధకంలో ప్రతి కుటుంబానికి సం.రం.లో 100 రోజుల పని దినాలను కల్పిస్తున్న అంశంపై అవగాహన కల్పించడంతో పాటు కూలీలకు గల హక్కుల గురించి తెలియజేసి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులకు స్పష్టం చేశారు.అంతేగాక ఉపాధిహామీ పధకాన్ని సద్వినియోగం చేసుకోడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభలో ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే రీతిలో వివరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. గ్రామ సభ సమాచారాన్ని కనీసం రెండు రోజులు ముందుగానే ఆయా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలందరికీ తెలియజేయడం ద్వారా ప్రజలందరూ అధిక సంఖ్యలో గ్రామ సభలో పాల్గొనేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. అదే విధంగా జిల్లా పంచాయితీ అధికారులు గ్రామ పంచాయితీ అధికారుల,సిబ్బందికి గ్రామ సభ నిర్వహణపై పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు.గ్రామ సభలు అర్ధవంతంగా జరగాలంటే గ్రామస్థులు,ప్రజా ప్రతినిధులు,అధికారులు గ్రామ సభల్లో మనస్పూర్తిగా పాల్గొనాలని ఆయన సూచించారు.గ్రామ సచివాలయల్లో పనిచేసే అందరు ఉద్యోగులు గ్రామ సభల్లో ప్రజలు అధికసంఖ్యంలో పాల్గొనేలా చేసి సభలు విజయవంతానికి కృషి చేయాలని చెప్పారు.అదే విధంగా 2024-25 ఆర్ధిక సంవత్సరంలో చేపట్టనున్న ఉపాధిహామీ పనులకు సంబంధించి గ్రామ సభలో చర్చించి గ్రామ సభ ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉపాధిహామీ పధకంలో చేపట్టే పనులు పేద కూలీలకు,రైతులకు,గ్రామానికి ఉపయోగపడే ఉత్పాదకతను పెంపొందించే పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని పనుల నాణ్యత విషయంతో ఎంతమాత్రం రాజీ పడవద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఉపాధిహామీ పధకం అమలుకు సంబంధించి కొంత మంది డ్వామా పిడిలు గ్రామాలను సందర్శిచడం లేదని పని ప్రదేశాలను తనిఖీ చేయడం లేదని,సోషల్ ఆడిట్ సభలకు హాజురు కావడం లేదని కింది స్థాయి అధికారులపై నియంత్రణ లేదనే కొన్ని వాస్తవాలు తన దృష్టికి వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.క్లస్టర్ స్థాయిలో పనిచేసే ఎపిడిలు పని ప్రదేశాలకు వెళ్ళడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని ఇక మీదట అలాంటి విధానాలను మార్చుకోవాలని చెప్పారు.అంతేగాక మండల స్థాయిలో పధకం అమలులో పూర్తి బాధ్యత వహించాల్సిన ఎంపిడిఓలు ఇది మనపని కాదన్నట్టు వ్యవహరించడం కేవలం సంతకాలకే పరిమితం కావడం,పని ప్రదేశంలో మస్టర్లు,తనిఖీ చేయకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయని అలాంటి వారిని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.పనికి సంబంధించిన రిజిష్టర్లు, వర్క్ ఫైల్స్ చాలా మండలాల్లో సరిగ్గా నిర్వహించడం లేదని ఇక మీదట ఎంపిడిఓలు పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మండల స్థాయిలో జరిగే అవకతవకలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.ఉపాధిహామీ పధకం అమలుకు సంబంధించి ఎపిఓలు,ఇసిలు,టిఏలు తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని చాలా ఫిర్యాదులు వస్తున్నాయని అలాంటి వారిని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.గ్రామ స్థాయిలో పనిచేసే అధికారులు బోగస్ అటిండెన్సు సహా పనికి రాకుండా హాజరు వేయడం, పనిచేయకుండా చేసినట్టు చూపడం,తక్కువ పనిచేసి ఎక్కువ పని నమోదు చేయడం వంటి అవకతవకలు చేస్తున్నట్టు గమనించామని అలాంటివి ఇకముందు సహించబోమని స్పష్టం చేశారు.పధకం అమలులో పారదర్శకత జవబుదారీ తనం పెంచాల్సిన సోషల్ ఆడిట్ విభాగంలో కూడా అవినీతి జరుగుతుందని ఫిర్యాదులు వస్తున్నాయని నిఘా పెట్టాల్సిన విభాగం పైనే నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోందంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్ధమవుతోందని అన్నారు.అవినీతి ఏస్థాయిలో జరిగినా క్షమించేది లేదని ఫీల్డు అసిస్టెంట్ స్థాయి నుండి పిడి వరకూ సోషల్ ఆడిట్ గ్రామ స్థాయి ఆడిటర్ నుండి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ వరకూ ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.అదే సమయంలో బాధ్యతాయుతంగా సమర్ధవంతంగా పనిచేసే అధికారులు,సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహించడం జరుగు తుందని చెప్పారు.ఇక మీదట ఉపాధి హామీ పధకాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు మనమందరం సమిష్టిగా కలిసి పనిచేసి దేశంలో మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేసి గ్రామాల అభివృద్ధి ద్వారా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాదిద్ధామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈసమావేశంలో రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ సోషల్ ఆడిట్ పబ్లిక్ హియరింగ్ కు డ్వామా పిడిలు విధిగా హాజరు కావాలని ఆదేశించారు.ఈనెల 23 నుండి జరిగే ప్రత్యేక గ్రామ సభల్లో గ్రామాల్లో సిసి రోడ్లు,డ్రైన్లు,రీచార్జి పిట్ ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఈవీడియో సమావేశంలో రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు కృష్ణ తేజ్,ఇఎన్సిలు బాలూ నాయక్,సంజీవ రెడ్డి,వాటర్ షెడ్ డైరెక్టర్ పివిఆర్ఎం రెడ్డి,అదనపు కమీషనర్ సుధాకర్ రావు,జాయింట్ కమీషనర్ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.