- అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలి
- 25న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 01:30 గంటల వరకు పరీక్షలు
- హాజరుకానున్న 32,391 మంది అభ్యర్థులు
- జిల్లాలో 111 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
- జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
- అనంతపురము బ్యూరో
ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రూప్- 2 పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు. ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న ఏపీపీఎస్సీ, గ్రూప్- 2 పరీక్షలకు సంబంధించి శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్ లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్- 2 సర్వీసెస్ కింద నిర్వహించనున్న (స్క్రీనింగ్ టెస్ట్)ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలు ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి 01:30 గంటల వరకు జరుగుతాయని, 32,391 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. జిల్లాలో 111 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని, ఇందుకోసం 38 రూట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 38 మంది రూట్ ఆఫీసర్లు ( సీనియర్ జిల్లా స్థాయి అధికారులు), 111 మంది లైజన్ ఆఫీసర్స్ (మండల స్థాయి అధికారులు)లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎక్కడా చిన్న తప్పు జరగకుండా పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు, పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించాలన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునేందుకోసం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 9:30 గంటలకల్లా అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. పరీక్ష సమయం పూర్తి అయిన తర్వాతనే బయటకు పంపించాలన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ డిప్యూటీ సెక్రెటరీ (మానిటర్) డి.అపరంజని, సెక్షన్ ఆఫీసర్లు పీవీ.నవజ్యోతి, జె.యశోద, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డి, సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, వెప్మా పీడీ విజయలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇహషాన్ బాషా, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, డిఎల్డివో ఓబులమ్మ, హార్టికల్చర్ డిడి రఘునాథ రెడ్డి, ఏపీఎంఐపి పిడి ఫిరోజ్ ఖాన్, మార్కెటింగ్ ఎడి చౌదరి, డిఈఓ వరలక్ష్మి, డీపీఓ ప్రభాకర్ రావు, సమగ్ర శిక్ష ఏపిసి వరప్రసాద్, డివిఈఓ వెంకటరమణ నాయక్, రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.