పోలీస్ వాహనాలను అడ్డుకున్న కార్యకర్తలు
-బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసాన్ని ముట్టడించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
-గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్న బీఆర్ఎస్ నేతలు
-సీపీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతల బైఠాయింపు
అరెస్ట్ చేసిన పోలీసులు
సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. సీపీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని రెండు వేర్వేరు వాహనాల్లో తరలిస్తున్నారు. రెండు వేర్వేరు వాహనాల్లో బీఆర్ఎస్ నేతలను పోలీసులు తరలిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నేతలు ఉన్న ఓ వాహనాన్ని కేశంపేట వైపు తరలిస్తున్నారు. మరో వాహనాన్ని షాద్‌నగర్ వైపుగా తరలిస్తున్నారు. నేతలను ఎక్కడికి తరలిస్తున్నారనే విషయం మాత్రం తెలియరాలేదు. అయితే, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని విడుదల చేయడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు. అరెస్టు చేయకపోతే కోర్టు వెళ్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యక్తలు దాడి చేసిన విషయం తెలిసిందే.కౌశిక్‌రెడ్డి ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కుర్చీలతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన గాంధీని పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అయితే, దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ సీపీ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగింది. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దాడిని ప్రోత్సహించిన సీఐ, ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టులకు దిగారు. బీఆర్ఎస్ నేతలను ఈడ్చుకుంటూ వాహనాల్లో పడేశారు. ఈ క్రమంలో హరీశ్‌రావును పోలీసులు లాక్కువెళ్లేందుకు ప్రయత్నించగా హరీశ్‌రావు కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.