ఇంట్లో, ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు.. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడం కాస్త కష్టమైన పనే. అయితే, రాత్రి పూట నిద్రలో మాత్రమే.. శరీరం తనను తాను పునరుద్ధరించుకునే అవకాశాన్ని పొందుతుంది. మరిసటి రోజు మిమ్మల్ని యాక్టివ్‌గా, ఉత్సాహంగా ఉంచుతుంది. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోతే.. మరిసటి రోజూ అలసటగా, మత్తుమత్తుగా, నిస్సత్తువగా ఉంటుంది. దీంతో ఏ పనిపైనా ధ్యాస పెట్టలేం. చాలామంది రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి అరోమా థెరపీ, మ్యూజిక్ థెరపీ ఫాలో అవుతూ ఉంటారు. అయితే, మన నిద్ర నాణ్యత నిద్రవేళకు ముందు గంటలలో మనం తినే వాటిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నిద్రవేళకు ముందు భారీ భోజనం తినకూడదని నిపుణులు చెబుతుంటారు, ఎందుకంటే ఇది అసౌకర్యం, అజీర్ణానికి దారితీస్తుంది. కానీ కొన్ని ఆహారాలు మీ మెదడును ప్రశాంతపరుస్తాయి, రాత్రి ఆరోగ్యకరమైన నిద్రను ప్రోత్సహిస్తాయి. వాటిలో అరటిపండు ఒకటి. రాత్రి నిద్రపోయే ముందు అరటపండు తింటే.. బాగా నిద్ర పడుతుందని నిపుణులు అంటున్నారు.అరటిపండు పోషకాల పవర్‌హౌస్ అని మనకు తెలిసిన విషయమే. ఈ పండులో మన నిద్రను ప్రేరేపించే.. పోషకాలు కూడా ఉంటాయి. అరటిపండులో ఉండే.. అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్ నిద్రను ప్రోత్సహిస్తుంది. ట్రిప్టోఫాన్ సెరోటోనిన్‌కు పూర్వగామి, మీ మానసిక స్థితిని నియంత్రించే, విశ్రాంతిని ప్రోత్సహించే న్యూరోట్రాన్స్‌మిటర్. అంతేకాకుండా, సెరోటోనిన్ మెలటోనిన్‌గా మారుతుంది. ఇది నిద్ర-మేల్కొనే చక్రాన్ని నియంత్రించడానికి బాధ్యత వహించే హార్మోన్. అరటిపండ్లు తినడం ద్వారా, మీరు ఈ నిద్రను ప్రోత్సహించే రసాయనాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన బిల్డింగ్ బ్లాక్‌లను మీ శరీరానికి అందజేస్తారు. ఇది మీరు ప్రశాంతంగా నిద్రలోకి జారేలా చేస్తుంది.