బతుకమ్మ కుంటలో ఇకపై కూల్చివేతలు చేపట్టబోమని హైడ్రా చీఫ్ రంగనాథ్ పేర్కొన్నారు. బుధవారం నాడు అంబర్ పేటలో పర్యటించిన ఆయన… బతుకమ్మ కుంటను సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. హైడ్రాపై అపోహలు, ఆందోళనలు అక్కర్లేదని హామీ ఇచ్చారు. ఆక్రమించిన స్థలంలో ఉన్న నివాసాలను కూల్చబోమని చెప్పారు. ఖాళీగా ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. స్థానికులతో బతుకమ్మ కుంట పునరుద్ధరణపై ఆయన చర్చించారు. 1962 నాటి రికార్డుల ప్రకారం బతుకమ్మ కుంట 16.13 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని, కాలక్రమంలో ఆక్రమణలకు గురై ప్రస్తుతం 5.15 ఎకరాలు మిగిలిందని చెప్పారు.ఈ విషయంలో స్థానికులు విజ్ఞప్తి చేయడంతో బతుకమ్మ కుంట ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణ చర్యలు చేపట్టామని హైడ్రా చీఫ్ పేర్కొన్నారు. అయితే, ఆక్రమించిన స్థలంలో ఉన్నప్పటికీ నివాస సముదాయాల జోలికి వెళ్లబోమని స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హైడ్రా ఎఫెక్టుతో నగరంలో రిజిస్ట్రేషన్లు పడిపోయాయని జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని కొట్టిపారేశారు.