చాలా మంది దోశ, ఇడ్లీ, వడ వంటి టిఫిన్లు చేసుకోవడానికి మినప్పప్పు తెచ్చి కిచెన్‌లో స్టోర్ చేస్తుంటారు. దీన్ని డబ్బాల్లో ఎక్కువ కాలం ఉంచితే, వాటిలో చిన్న పురుగులు, తవిటిపురుగు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శనగలకు కూడా వీటి బెడద ఎక్కువే. వీటికి పురుగులు పట్టకుండా ఫ్రెష్‌గా ఎలా ఉంచుకోవాలో చూద్దాం..శనగపప్పు, మినప్పప్పులో తేమ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా పురుగులు పట్టే అవకాశం ఉంది. అందుకే స్టోర్ చేసే ముందు బాగా ఎండబెట్టాలి. వీటిని కొన్న తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. అనంతరం కనీసం 2-3 రోజులు బాగా ఎండబెట్టాలి. దీంతో వాటిలోని తేమ పూర్తిగా ఆవిరైపోతుంది. మినప్పప్పును లైట్‌గా ఫ్రై చేయడం మంచిది. దీంతో పప్పుకు పురుగులు పట్టవు. వీటిని ఒక గాజు సీసా లేదా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో స్టోర్ చేయాలి. ఆ కంటైనర్ లేదా పాత్రను చల్లని, పొడి ప్రదేశంలో ఉంచాలి.
శనగ పప్పు, మినప్పప్పుకు పురుగులు పట్టకుండా ఉండాలంటే, స్టోరేజీ కంటైనర్‌లో బిర్యానీ ఆకులు వేయాలి. ఈ ఆకుల వాసన పురుగులను వికర్షిస్తుంది. పప్పు ధాన్యాలు నిల్వ చేసిన డబ్బాలో ఎండుమిర్చి ముక్కలు చేసి వేయాలి. ఎండు మిర్చి ఒక పురుగుమందు లాగా పనిచేస్తాయి, పప్పులో ఉన్న పురుగులను చంపుతాయి. ధాన్యాలు, పప్పులు ఏ రకమైనవి అయినా పురుగుల బారిన పడకుండా ఉంచడానికి రెడ్ చిల్లీ వాడవచ్చు. వీటి వాసనను పురుగులు తట్టుకోలేవు.డబ్బాల్లో పప్పు నిల్వ చేసేటప్పుడు దాల్చిన చెక్క వేయాలి. దీని వాసనను పురుగులు భరించలేవు, దీంతో అవి పప్పు ఉన్న చోటుకు రాలేవు. ఇది పప్పు ధాన్యాలకు మంచి రుచిని కూడా ఇస్తుంది, తేమను నిలుపుకునేలా చేస్తుంది. స్టీల్ డబ్బాలు తేమను ఆకర్షించవచ్చు. దీంతో పురుగులు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అందుకే గ్లాస్ కంటైనర్స్‌లో పప్పు ధాన్యాలను నిల్వ చేయడం మంచిది.