దిగజారి పోతున్న పోలీసుల పరువు
ప్రజారక్షణ మరిచి వ్యక్తి పూజకు అలవాటు పడి
విధులు మరిచి వినోదం కోసం వికృత చేష్టలు..
సిగ్గు విడిచి సమాజంలో దిగజారి పోయి..
ఖాఖీ వృత్తికే కళంకితం తెచ్చేలా..
కాసుల కోసం..కావాల్సిన పోస్టుల కోసం..
కక్కుర్తి పనులు చేసి కటకటాల పాలు అవుతుంటే. .
ఖాఖీలపై ఉన్న కరుణ కాటికి చేరదా ..
ఇదేనా వీరి రాజ్యాంగ స్ఫూర్తి..
మూడు సింహాలు తగిలించుకునేది ముష్టి పనులు చేయడానికా..
మీరేమి పోలీసులు ..మీదేమి వృత్తి ధర్మం..
ఛీ.. ఛీ…ఇంత సిగ్గు మాలిన పనులా..
ఎందుకింత దిగజారుడుతనం…
దేనికోసం ఇంత నీచానికి ఒడిగట్టడం…
ఓ పోలీసన్న నీ పరువు పోతే ఎలా అన్న…
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
నవ్విపోదురుగాక నాకేల సిగ్గు అన్న చందంగా నాలుగు రూపాయల కోసం నమ్మిన సిద్ధాంతాన్ని ,నమ్మి అప్పగించిన న్యాయమైన బాధ్యతను నడివీదిలో నిలబెడుతున్న నయా పోలీసులను చూసి ప్రజలు పక్కున నవ్వుతున్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసుల పాత్ర చాలా కీలకమైనది.కానీ కొంతమంది ఖాఖీలు కాసుల కోసం,ఖరీదైన జీవితం కోసం..కావల్సిన పోస్ట్ కోసం ఖద్దరు బాబుల కాళ్ళ దగ్గర ప్రణవిల్లి పాడు పనులు చేస్తుంటే ఇదేనా ప్రజాస్వామ్య స్ఫూర్తి అన్నది అర్థం కావడం లేదు. చట్టానికి.. ధర్మానికి.. న్యాయానికి.. తేడా ఏమిటీ అంటే ..“మనిషి తాను సుఖంగా, సంతోషంగా ఉంటూ, అవతలి మనిషి సుఖసంతోషాలకు ఇబ్బంది కలిగించకుండా జీవించడం – “ధర్మం”ఆ ధర్మాన్ని అనుసరించి సమాజ మనుగడ సాఫీగా సాగిపోయేలా సంఘం ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లు, విధివిధానాలు – “చట్టం”ఒకవేళ ఆ చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే, నిజానిజాలు పరిశీలించి, నిర్ధారణ చేసి ఆ అపరాధానికి తగిన శిక్ష విధించేది – “న్యాయం”కాలాన్ని బట్టి ధర్మాలు మారిపోతూ ఉంటాయి. ఆ ధర్మాలకు అనుగుణంగా చట్టాలు తయారవుతుంటాయి. ఆ చట్టాలను అనుసరించి న్యాయస్థానాలు తీర్పులిస్తుంటాయి.ధర్మం పరిధి చాలా ఎక్కువ. దాని లోతు అందరి బుద్ధులకూ అందేది కాదు. సమాజ హితమే దాని పరమావధి. ధర్మం చాలా కఠినమైంది కూడా. అందుకే రాముడంతటివాడు పుత్రధర్మాన్ని అనుసరించి అరణ్యవాసాన్ని, రాజధర్మాన్ని అనుసరించి సీతావియోగాన్ని అనుభవించవలసి వచ్చింది. ఈ సమాధానం మొదట్లో చెప్పిన ధర్మం అన్నది ఒక ఉదాహరణ మాత్రమే. కాకపోతే అది అన్ని కాలాలకూ వర్తించేది. ఇది కాక ఇలాంటి ధర్మాలు ఎన్నో ఉన్నాయి. ధర్మాలేమిటి; ధర్మశాస్త్రాలే ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రాలు కూడా కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. అందుకే కృతయుగ ధర్మశాస్త్రమైన మనుస్మృతి కలియుగానికి వర్తించదు. కలియుగానికి వర్తించే ధర్మశాస్త్రం పరాశరస్మృతి. అలా అని ఒక కాలం ధర్మశాస్త్రం మరో కాలానికి అస్సలు ఉపయోగపడదని కాదు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” – ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనంద తాండవం చేస్తారన్నాడు మనువు. ఈ ధర్మసూత్రం సర్వకాలీనమైనది.ఇక చట్టం వ్యక్తిగతంగా ఆలోచించదు. ఆ మనసు దానికి లేదు. సమాజహితం కోసం ఏర్పాటు చేయబడ్డ కట్టుబాటును ఒకవ్యక్తి ఏ కారణంగా తప్పినా అతను చట్టాన్ని అతిక్రమించినట్టే లెక్క. ఆకలికి తట్టుకోలేక ఒకడు దొంగతనం చేసినా, చట్టప్రకారం అది నేరమే. అతడు న్యాయస్థానం బోనులో నిలబడక తప్పదు.చివరిగా న్యాయం కనులు లేనిది. తన ముందు నిలబడ్డవాడు ఉన్నవాడా, లేనివాడా, మంచివాడా, చెడ్డవాడా, తనకు పరిచస్థుడా, కాడా! మొదలైన విశేషణాలను అది చూడదు, పట్టించుకోదు. వాద ప్రతివాదనలను, ఆ సంఘటన చూసినవారి సాక్ష్యాలనూ విని, పరిశీలించి తీర్పు చెబుతుంది.జస్టిస్ చౌదరి సినిమాలో.. “చట్టానికి, న్యాయానికి జరిగిన ఈ సమరంలో..” అనే సందర్భానుసారంగా వచ్చే పాట ఒకటుంది. ఆ పాటలో గీత రచయిత వేటూరి.. “కఠినమైనది ధర్మం, కనులు లేనిదీ న్యాయం, మనసు లేనిదీ చట్టం, మనిషి జన్మకిది ఖర్మం” అంటూ ఒకే ఒక్క వాక్యంలో ఇంత అర్థాన్నీ ఇమిడ్చేశారు. “మనిషి జన్మకిది ఖర్మం” అన్న మాట.. సినిమాలో ఆ ప్రత్యేక సందర్భం కోసం వ్రాసినదే అయినా, ప్రస్తుతం సమాజస్థితికి కూడా ఆ మాట అద్దం పడుతోంది. అయితే ఇక్కడ కొంతమంది పోలీసుల నిర్లక్ష్యం అశ్రద్ధ అవినీతి అలసత్వం కారణంగా పోలీసు వ్యవస్థ మసకబారుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉదంతాలు కేవలం పొకేసుల అత్యుత్సాహం వలనే అధిక మయ్యాయని చెప్పాలి.ఇలా ఎందుకు అనాల్సింది వస్తుంటే నాటి వైసీపీ యంపి ప్రస్తుత ఏపీ శాసనసభ ఉప సభాపతి విషయంలో సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ ఉదంతం చూస్తే ఎంత సిగ్గు మాలిన స్థితిలో పోలీసు వ్యవస్థ ఉన్నదో అర్ధమవుతుంది. కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టిన తరువాత పోలీసు వ్యవస్థ ఎంత దిగజారి పోయి ప్రజా ప్రతినిధుల సేవలో తరించి ప్రజలని ఎంత ఇబ్బందులు గురిచేసారో అర్ధమవుతుంది. నటి కాదంబరి జైత్వాని ,ఆతరువాత సోషియల్ మీడియా పోకిరని కట్టడి చేయుట లోఐపీఎస్ లు ఎంత నిర్లక్ష్యం వహించి సస్పెండ్ ,బదిలీలు ఇలా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కూడా ఇంకా కొంతమంది కింది స్థాయి పోలీసులు కొత్త సీసాలో పాత సారా అన్న విధాన గత ప్రభుత్వ ములో అలవాటు పడిన తీరు ఇంకా మరలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా పోలీసు వ్యవస్థ ఇలా మాయని మచ్చ అంట కంటుకోవడం చాలా దారుణమని కొంతమంది పోలీసు అధికారులు ఆవేదన చెందుతున్నారు.