Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యంఇదేనా మన భారతం..!

ఇదేనా మన భారతం..!


(సురేష్..9948546286)


రోజుకో అమానుషం..
మృగాడి విద్వేషం..
వికృతరూపం
నిస్సహాయను నిలువునా కూల్చేసే నరరూపరాక్షసుడి
జుగుప్సాకర ప్రతాపం..!

ఏం జరుగుతోంది
మన సమాజంలో..
రోజుకో కోణంలో
కనిపిస్తుందేమిటి మనిషి నైజం
ఏదో రూపంలో
ఆడకూతురుపై దౌర్జన్యమేనా..
మనం నేర్చిన చదువు..
గురువులు చెప్పిన బుద్దులు..
పెద్దలు బోధించిన సుద్దులు..
చిన్నతనంలో అమ్మానాన్న
నేర్పిన పాఠాలు..
తాతలు బామ్మలు
చూపిన బాటలు
జీవితంలో అనుభవాలు నేర్పిన గుణపాఠాలు…
సంస్కృతి నేర్పిన సంస్కారం..
రామాయణం చూపిన మార్గం..
ఏమైపోయాయి ఇవన్నీ..!?

అసలు ఏమిటీ విపరీతం..
ఏమైపోయింది
మనిషిలోని ఇంగితం..
అమ్మ,అక్క,చెల్లి,వదిన,
భార్య..కూతురు..
ఎవరూ గుర్తు రారా..
అలాంటి ఆడదేగా..
నీ ఇంటి మనిషి కాదనా..
అసలు అడిగేవాడే లేడనా..
నీలో మానవతే లేదనా..!

ఎప్పుడో రాక్షసులు
ఇలా చేశారని..
రాతి యుగంలో
సంస్కారం ఎరగని
మనుషులు ఇలా ప్రవర్తించేవారని విన్నాం..
ఛీ అనుకున్నాం..
ఇప్పుడు చూస్తున్నాం..
ఛీదరించుకుంటున్నాం..
ఛీత్కరించుకుంటున్నాం..!

కొందరు కుర్రాళ్ళు
పశువులుగా మారి..
తమలాంటి మరో మనిషిని..
అందునా నిస్సహాయను
ఇంత కర్కశంగా..
మంచి మరచి..
విజ్ఞత విడిచి..
విచక్షణ విస్మరించి..
మానవతను మంటగలిపి..
దానవతను కలగలిపి..
దౌర్జన్యం చేయడం..
ఇది మొదలు కాదు..
కాని తుది కావాలి..
ఇలాంటి పైశాచికాలకు
ఇక చరమగీతం పలకాలి..!

ప్రభుత్వాలు కదలాలి
న్యాయస్థానాలు స్పందించాలి..
ముష్కరులను
సత్వరమే శిక్షించాలి..
రేపు మరో రాక్షసుడు లేవకుండా..
ఎల్లుండి ఇంకో అకృత్యానికి తావు లేకుండా..
కఠిన దండన..శిరోముండన..
గార్ధభ సవారీ ప్రదర్శన..
వచ్చినా రాకున్నా
ఆ కర్కోటకుడిలో పరివర్తన..
అది రేపటి
మరో కంటకుడికి
కాదా హెచ్చరిక..
ఇదే..ఇదే..
ఈ వేదభూమిలో
ప్రతి తల్లి పొలికేక..!

✍️✍️✍️✍️✍️✍️✍️✍️

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article