కండరాల పెరుగుదల, దృఢత్వానికి శిక్షణతో కూడిన వ్యాయామం అవసరమని సూచన
మారిపోతున్న జీవనశైలి కారణంగా మనుషుల శరీరాలు రోగాల పుట్టలుగా మారుతున్నాయి. సమయానికి తినే అలవాట్లు లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. అయితే వైద్య నివేదికల ఆందోళనలు, నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఫిట్‌నెస్, రెగ్యులర్ వ్యాయామాలపై అవగాహన గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ప్రతిరోజు 10,000 అడుగుల నడక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనే ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లింది.
మరి నిజంగా రోజుకు 10 వేల అడుగులు నడిస్తే ఫిట్‌నెస్, ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదా? జిమ్ వర్కౌట్‌లు లేదా అదనపు వ్యాయామాల అవసరం లేదా? 10 వేల అడుగుల ఆరోగ్య సూత్రం ఎంతవరకు సరైనది? అనే సందేహాలకు న్యూఢిల్లీలోని పీఎస్ఆర్‌ఐ హాస్పిటల్‌లో కార్డియాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రవి ప్రకాశ్ పలు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ప్రతిరోజూ 10,000 అడుగులు నడవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని, అయితే అన్ని రకాల వ్యాయామాలకు ఇది ప్రత్యామ్నాయం కాదని రవి ప్రకాశ్ స్పష్టం చేశారు. ప్రత్యేకించి కండరాల పెరుగుదల కోసం చేసే వ్యాయామానికి ఇది ప్రత్యామ్నాయం కాదన్నారు. కేవలం నడకతో కండరాలు బలపడవని, దీనికి తగిన వెయిట్ ట్రైనింగ్ అవసరమని ఆయన చెప్పారు.
10,000 అడుగుల నడకతో చక్కటి ఆరోగ్యం
ప్రతి రోజూ 10 వేల అడుగుల నడకతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ వాకింగ్‌తో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలో నడక దోహదపడుతుంది. ఇక రోజుకు 10,000 అడుగుల నడక దాదాపు 8 కిలోమీటర్లతో సమానం. ఇంత నడక నడిస్తే దాదాపు 500 కేలరీలు బర్న్ అవుతాయి. ఫలితంగా బరువు తగ్గి ఫిట్‌నెస్‌గా ఉండొచ్చు. శరీరం చాలా చురుకుగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా రోజుకు 10,000 అడుగులు నడవడం అభినందనీయమని, అయితే రోజుకు కనీసం 7,000 లేదా 5,000 అడుగులు నడిచినా చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని వైద్య నిపుణులు చూచిస్తున్నారు.