పీసీసీ ఎపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల బరిలో దిగుతున్నారు. కడప పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఏఐసీసీ పెద్దలు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈనెల 25న కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే అభ్యర్థుల జాబితాలో షర్మిల పేరు చేర్చినట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్నటి వరకు కడప పార్లమెంటుకు మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి సతీమణి వైఎస్. సౌభాగ్యమ్మ లేదా ఆయన కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి పోటీ చేస్తారని అంతా భావించారు.అనూహ్యంగా ఏఐసీసీ రూటు మార్చింది. షర్మిలను కడప ఎన్నికల బరిలో దింపాలని సంకల్పించింది. కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తే ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. కడప పార్లమెంటు స్థానంలో పోటీ చేసేందుకు షర్మిల అంగీకరించారని తెలుస్తోంది. ఈనెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల బోగట్టా. ఈ వార్తతో కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పోటీతో షర్మిల నేరుగా అన్న జగన్ పైనే పోటీకి దిగినట్లుగా జిల్లా ప్రజలు భావిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే షర్మిల దూకుడుగా వెళ్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులేస్తోంది.