హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ని సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఒకరు చెంపదెబ్బ కొట్టినట్టుగా తెలుస్తోంది. చంఢీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. ఢిల్లీ వెళ్లాల్సిన విమానం కోసం కంగనా వేచిచూస్తున్న సమయంలో జరిగినట్టుగా సమాచారం. రైతు చట్టాలకు వ్యతిరేకంగా 15 నెలల పాటు కొనసాగిన ఉద్యమాన్ని, రైతులను అగౌరవ పరిచారంటూ కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కంగనాతో తీవ్ర వాగ్వాదానికి దిగిందని, అకస్మాత్తుగా చెంపపై కూడా కొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ అనూహ్య పరిణామంతో షాక్‌కు గురైన కంగనా అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లాక సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చంఢీగడ్ ఎయిర్‌పోర్టులోని నిషేధిత ప్రదేశంలో ఉన్న సమయంలో కంగనాపై కానిస్టేబుల్ చేయి చేసుకున్నట్టు కంగనా ఆరోపించారు. దీంతో నిందిత కానిస్టేబుల్‌ను కమాండింగ్ ఆఫీసర్ గదిలో విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. చంఢీగడ్ విమానాశ్రయంలో ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీ ఫుటేజీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్టు సీఐఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి.